రోజు కాదు... వారం గ్యాప్‌తో రెండు సినిమాలు!
ABN , Publish Date - Feb 20 , 2026 | 07:07 PM
ఈ నెలాఖరులో ఒక్క రోజు తేడాతో విడుదల కావాల్సిన శ్రీవిష్ణు సినిమాలు రెండు... ఇప్పుడు వారం గ్యాప్‌తో రానున్నాయి. ఈ నెల 27న 'విష్ణు విన్యాసం' విడుదల అవుతుండగా, మార్చి 6న 'మృత్యుంజయ్' రాబోతోంది.
హీరో శ్రీవిష్ణు (Srivishnu) నటించిన రెండు సినిమాలు ఈ నెలాఖరులో ఒక్క రోజు తేడాలో విడుదల కావాల్సి ఉంది. ఈ నెల 27న 'మృత్యుంజయ్' (Mruthyunjai) చిత్రం విడుదల కావాల్సి ఉండగా, 28న 'విష్ణు విన్యాసం' (Vishnu Vinyasam) ను రిలీజ్ చేయబోతున్నట్టు ఈ చిత్రాల నిర్మాతలు ప్రకటించారు. దాంతో రంగంలోకి దిగిన శ్రీవిష్ణు నిర్మాతల మధ్య సయోధ్యను కుదిర్చినట్టు తెలిసింది. ఈ మధ్య 'విష్ణు విన్యాసం' ప్రెస్ మీట్‌లో తన చిత్రాలు ఒకే వారం ఎట్టి పరిస్థితుల్లో విడుదల కావని విష్ణు స్పష్టం చేశాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు 'విష్ణు విన్యాసం'ను ఒక రోజు ముందే అంటే ఫిబ్రవరి 27నే విడుదల చేస్తుండగా, 'మృత్యుంజయ్' మూవీ మార్చి 6న విడుదల కాబోతోంది. అంటే ఒక రోజు గ్యాప్ కాకుండా ఒక వారం గ్యాప్‌తో ఈ రెండు సినిమాలు రాబోతున్నాయి.
'మృత్యుంజయ్' చిత్రాన్ని హుస్సేన్ షా కిరణ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. దాన్ని రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. 'సామజవర గమన' తర్వాత శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ మరోసారి ఈ సినిమాలో అతనితో జత కట్టింది. ఇక 'విష్ణు విన్యాసం' మూవీని యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు నిర్మించారు. ఈ సినిమాలో నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్. వాస్తు పిచ్చి ఉన్న ఓ యువకుడి కథగా దీన్ని వినోద ప్రధానంగా తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలకు ఇప్పటికే ఓటీటీ అగ్రిమెంట్ పూర్తయ్యిందని, అందువల్ల వారి ఒత్తిడి మేరకు ఈ సినిమాలు ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.