హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్‌కు ఊహించని ట్విస్ట్.. త్రివిక్రమ్ అవుట్
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:43 PM
ఒక భాషలో హిట్ అయిన సినిమా వేరొక భాషలో డబ్ అవుతోంది అంటే.. అది కూడా స్టార్ బ్యానర్ రిలీజ్ చేస్తుంది అంటే ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి నెలకొంటుంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందా అనే ఆతృత కలుగుతుంది.
ఒక భాషలో హిట్ అయిన సినిమా వేరొక భాషలో డబ్ అవుతోంది అంటే.. అది కూడా స్టార్ బ్యానర్ రిలీజ్ చేస్తుంది అంటే ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి నెలకొంటుంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందా అనే ఆతృత కలుగుతుంది. ప్రస్తుతం హనుమాన్ అంశ్(Hanuman Ansh) సినిమాపై కూడా టాలీవుడ్ ప్రేక్షకుల్లో అదే ఆతృత కలిగింది. దర్శకుడు విశాల్ చతుర్వేది రూపొందించిన ఈ చిత్రం హిందీలో అపూర్వ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అలాంటి ఈ సినిమా తెలుగులో డబ్ అవ్వడమే కాకుండా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 18 న రిలీజ్ చేయనున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయితే విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ టాలీవుడ్‌లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ సినిమా సమర్పణ బాధ్యతల నుంచి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరి నిమిషంలో తప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్లాన్ చేసిన తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ రద్దు కావడం, ఇప్పటివరకు ప్రమోషన్లు, సెన్సార్ క్లియరెన్స్ ప్రక్రియ పూర్తవ్వకపోవడానికి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడమే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 18న లాక్ చేసిన విడుదల తేదీకి సమయం దగ్గరపడ్డా, టీజర్ కూడా బయటకు రాకపోవడంతో తెలుగు వర్షన్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఒకవేళ త్రివిక్రమ్ తప్పుకున్న మాట నిజమైతే, తెలుగులో ఈ డివోషనల్ వండర్‌ను థియేటర్లలో చూడాలనుకున్న టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది పెద్ద నిరాశే అని చెప్పాలి. అయితే, గురూజీ ఎందుకు తప్పుకున్నాడు..? దీనికి గల అసలు కారణాలు ఏంటనేది, అలాగే వేరే డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా రంగంలోకి దిగుతారా లేదా అనేది ఇంకా మిస్టరీగా మారింది. అయితే గురూజీ కనుక అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తే కనుక.. ఆయనకు బాగా కలిసివచ్చేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి చివరకు హనుమాన్ అంశ్ ఎవరి చేతికి చిక్కుతుందో చూడాలి.