God of War: గీత దాటిన తివిక్రమ్.. చరిత్ర సృష్టించేనా
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:19 PM
మాటలతో గారడీ చేయాలన్నా.. ప్రాసలతో చెడుగుడు ఆడాలన్నా అది ఒక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కే సాధ్యం.
మాటలతో గారడీ చేయాలన్నా.. ప్రాసలతో చెడుగుడు ఆడాలన్నా అది ఒక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)కే సాధ్యం. ఆయన రాసే ప్రతి డైలాగ్లోనూ, తెరకెక్కించే ప్రతి పాటలోనూ అచ్చతెలుగుదనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆయన కెరీర్లో ఎక్కువ భాగం క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే కథలకే ప్రాధాన్యం ఇచ్చారు. డైనింగ్ టేబుల్ డ్రామాలు, బాంధవ్యాలు, మధ్యతరగతి విలువల చుట్టూ కథలు అల్లి గోల్డెన్ హిట్స్ కొట్టడం ఆయన బలం. కానీ, ఏ దర్శకుడైనా ఒకే జోనర్లో ఉండిపోతే ప్రేక్షకులు బోరింగ్‌గా ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే త్రివిక్రమ్ అప్పుడప్పుడు తన కంఫర్ట్ జోన్ దాటి భారీ సాహసాలు చేస్తుంటారు. ఇప్పుడు మరోసారి తన పరిధిని దాటి ఇండియన్ సినిమా షేక్ అయ్యే రేంజ్లో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.
ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే.. అజ్ఞాతవాసి రూపంలో త్రివిక్రమ్ కెరీర్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ సమయంలో ఆయన కథల ఎంపికపై ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. సరిగ్గా అప్పుడే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో కలిసి అరవింద సమేత వీర రాఘవ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. అప్పటివరకు త్రివిక్రమ్ అంటే కేవలం సాఫ్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే అనుకున్నవారికి ఆ సినిమా షాక్ ఇచ్చింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం, రక్తపాతం, గుండెల్ని పిండేసే ఎమోషన్స్‌తో త్రివిక్రమ్ మార్క్‌కు పూర్తి భిన్నంగా ఓ పవర్ఫుల్ అటెంప్ట్ చేశారు. ఫ్యాక్షన్ గొడవల్లో నలిగిపోయే ఆడబిడ్డల వేదనను తెరపై ఆవిష్కరించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా అది. ఇక రీసెంట్గా దీపావళి కానుకగా రిలీజైన ఆదర్శకుటుంబం చిత్రం కూడా ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కి మరోసారి సక్సెస్ సాధించాడు.
ఇప్పటి వరకు త్రివిక్రమ్ ఎప్పుడు ట్రై చేయని కొత్త జానర్ ఇది. ఇలా రెండు సార్లు ప్రయోగం చేసి సక్సెస్ సాధించిన త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ (God of War) తో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి స్టార్ డైరెక్టర్లు తమ సక్సెస్ ఫార్ములాను వదిలి కొత్త ప్రయోగాలు చేయడమంటే కత్తిమీద సామే. భారీ బడ్జెట్లతో రూపొందే చిత్రాల్లో చిన్న తేడా వచ్చినా ఫలితం తేలిపోతుంది. ప్రేక్షకులు కొత్తదనాన్ని ఎంత కోరుకుంటారో, టికెట్ రేటుకు తగ్గ ఎంటర్టైన్మెంట్ను కూడా అంతే బలంగా ఆశిస్తారు. ఈ బ్యాలెన్స్‌ను కొనసాగిస్తూనే.. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌ను విడిచిపెట్టకుండా విభిన్నమైన ట్రీట్మెంట్తో ఆడియన్స్ ముందుకు తెచ్చిన ప్రయత్నాలు మంచి ఆదరణ పొందాయి. బలమైన భావోద్వేగాలతో పాటు రా అండ్ ఇంటెన్స్ ఎలిమెంట్స్‌ను జోడించి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు. దీంతో త్రివిక్రమ్ ఎలాంటి జోనర్‌నైనా డీల్ చేయగలరనే నమ్మకం సినీ వర్గాల్లో మరింత బలపడింది.
ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త స్కేల్‌తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు చేసిన జోనర్లన్నింటికీ పూర్తి భిన్నంగా, మైథాలజీ కాన్సెప్ట్‌తో ఈ కథ సాగనుందనే వార్తలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పురాణాల లోతుపాతులు తెలిసిన రచయితగా త్రివిక్రమ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ అధ్యయనాన్ని, ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కలిపి పాన్-ఇండియా లెవల్లో భారీ విజువల్ వండర్‌గా తీసుకురాబోతున్నారు. అరవింద సమేతలో రక్తపాతాన్ని ఆపిన వీరుడిగా ఎన్టీఆర్‌ను చూపించిన దర్శకుడు.. ఈ గాడ్ ఆఫ్ వార్ లో ఎలాంటి విశ్వరూపం చూపిస్తారో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధారణంగా దర్శకులు సక్సెస్ ఇచ్చిన బాటలోనే సురక్షితంగా ప్రయాణించడానికి ఇష్టపడతారు. కానీ త్రివిక్రమ్ మాత్రం తన పరిధులను బద్దలు కొడుతూ కొత్త కథల వేటకు బయలుదేరారు. మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాయనుందో వేచి చూడాలి.