Trivikram: ప్రభాస్‌లోని ఆ టాలెంట్‌ను ఎవరూ సరిగ్గా వాడుకోలేదు..

ABN , Publish Date - Nov 03 , 2026 | 04:31 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు (Prabhas) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్‌, ఎమోషన్ హీరోగా, మాస్‌ ప్రేక్షకుల అభిమాన నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ప్రభాస్‌లో మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉందని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) అన్నారు. ముఖ్యంగా ఆయనలో అద్భుతమైన హ్యూమర్ ఉందని, దాన్ని ఇప్పటివరకు ఎవరూ పూర్తిస్థాయిలో తెరపై ఆవిష్కరించలేకపోయారని అభిప్రాయపడ్డారు. 

ప్రభాస్‌ను చాలామంది యాక్షన్ హీరోగానే చూస్తుంటారు. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు తిరుగులేని గుర్తింపు వచ్చింది. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్నారు. అయితే ప్రభాస్‌లో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సినిమాల్లో ఆయనలోని హ్యూమర్‌ను చూడొచ్చు. తనదైన అమాయకత్వం, చిలిపి మాటలతో ప్రేక్షకులను నవ్వించే అద్భుతమైన టైమింగ్ ప్రభాస్ సొంతం అని పలు చిత్రాలు నిరూపించాయి. 

తాజాగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో పాల్గొన్న త్రివిక్రమ్.. ప్రభాస్ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌లో సహజమైన హాస్య చతురత ఉందని, ఆయన కామెడీ టైమింగ్ చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. త్రివిక్రమ్ వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రభాస్‌లోని  హ్యూమర్  యాంగిల్ పై చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఏదైనా దర్శకుడు ప్రభాస్‌లోని కామెడీ టాలెంట్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటే అభిమానులకు మంచి వినోదం అందడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్‌తో పాటు కామెడీలోనూ ప్రభాస్ తనదైన ముద్ర వేయగలరని అభిమానులు భావిస్తున్నారు.

Updated Date - Nov 03 , 2026 | 05:20 PM