NTR: ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకునే ధైర్యం ఎంతమంది చేస్తున్నారు..

ABN , Publish Date - Jan 18 , 2026 | 02:17 PM

విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారకరామారావు (NTR) 30వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ  నందమూరి తారకరామారావు (NTR) 30వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఫిల్మ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి సినీ పరిశ్రమకు చెందిన పలు శాఖల ప్రముఖులు పూల మాలలతో నివాళి అర్పించి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘మనదేశం’ చిత్రంలో ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ ప్రకారమే ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏ స్థాయికి ఎదిగారో అందరికీ తెలిసిందే! ఆయన మనల్ని విడిచి 30 ఏళ్లు దాటిని... ఇప్పటికీ మా అందరికీ సజీవంగా వచ్చి పలకరిస్తునట్టే ఉంటుంది. అన్నగారు లేరని ఏరోజు అనుకోలేదు. పరుచూరి బ్రదర్స్‌ 400లకు పైగా చిత్రాలకు రచయితలుగా పని చేసి ఈ స్థాయికి చేరుకున్నామంటే ఎన్టీఆర్‌గారే కారణం’ అని అన్నారు.

Ntr  (3).jpeg
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి ఎన్టీఆర్‌. స్వార్థం లేని మనిషాయన. సినిమాల్లో ఆయన చేయని ప్రయోగం లేదు.. కథ లేదు. అలాంటి వ్యక్తిని ఏడాదికి ఓసారి జయంతి, వర్థంతులకు గుర్తు చేసుకొని, పూల మాలలు వేసి నివాళులు అర్పించడం కాదు.. రాజకీయంలో అయినా, సినిమాల్లో అయినా ఆయన్ను ఆదర్శంగా తీసుకునే ధైర్యం ఉండాలి. ఇవాళ ఎంతమందిలో ఆ ధైర్యం ఉంది. ఆయనలా స్వార్థం లేకుండా ఈ రోజున రాజకీయం చేయగలరా? చేయాలనే ఆలోచన జనాల్లో రావాలంటే ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి’ అని అన్నారు.

కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ ‘తెలుగు సినిమా చరిత్రలో నంబర్‌వన్‌ ఎన్టీఆర్‌గారు. ఆయన ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించకపోతే ఈరోజున చాలామంది రాజకీయాల్లో, పలు పదవుల్లో ఉండేవారు కాదు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ రెండు కళ్లు. ఇప్పుడు ఇద్దరూ లేరు. అక్కినేని నాగేశ్వరరావుగారి విగ్రహం కూడా పెట్టాలని నా కోరిక. అందుకు పరిశ్రమ పెద్దలు కృషి చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Ntr  (4).jpeg

మాదాల రవి మాట్లాడుతూ ‘తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు. తెలుగు జాతికి, సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన అలాంటి వ్యక్తి భారతరత్న ఇవ్వాలి. దానికోసం మనమంతా కృషి చేయాలి’ అన్నారు.

దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌ మాట్లాడుతూ ‘రామారావుగారంటే క్రమశిక్షణ. తెలుగువారికే కాదు. ఆయన ప్రారంభించిన ప్రాంతీయ పార్టీకి దేశంవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఆయన గొప్ప దర్శకుడు’ అని అన్నారు.

వై.వి.ఎస్‌ చౌదరి మాట్లాడుతూ ‘చరిత్రలో గొప్ప వ్యక్తులకే విగ్రహాలు పెడుతుంటారు. తద్వారా భావితరాలకు వారి చరిత్ర తెలియాలని. కొందరు అవతార పురుషులు, మహానుభావులకే జననం- మరణం అని కాకుండా జయంతి, వర్ధంతి అని చెబుతాం. అలాంటి ప్రయాణం ఎన్టీఆర్‌ది. వెండితెర వేల్పుగా నిలిచారు. అంకితభావం, కార్యదక్షత, క్రమశిక్షణగా ఉండి అగ్రగామిగా ఎదిగారు. మద్రాసీలు అని పిలవబడుతున్న మనల్ని తెలుగుజాతి అని ప్రపంచవ్యాప్తంగా మన ఉనికికి తెలిపారు’ అన్నారు.  

‘ప్రతి నటుడికి నందమూరి తారకరామారావు ఓ శిక్షణాలయం. ప్రతి నటుడు, రాజకీయ నాయకుడు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి. తెలుగువాడి పౌరుషం, పరాక్రమం ప్రపంచానికి చాటి చెప్పి ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌’ అని ప్రసన్నకుమార్‌ అన్నారు.

నందమూరి జానకీరామ్‌ భార్య దీపిక, మోహనరూప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

Updated Date - Jan 18 , 2026 | 04:29 PM