Transfer Trimurthulu Trailer: కానిస్టేబుల్ వేసిన స్కెచ్‌కి సీఎం మైండ్ బ్లాక్..

ABN , Publish Date - Jun 12 , 2026 | 09:55 PM

ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళి, మనసిచ్చి చూడు, స్నేహితుడు లాంటి సినిమాలతో లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

Transfer Trimurthulu

ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళి, మనసిచ్చి చూడు, స్నేహితుడు లాంటి సినిమాలతో లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక మధ్యలో సినిమాలు వదిలేసిన ఆయన చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ అండ్ ఇంటెన్సివ్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (Transfer Trimurthulu) ’. కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 19 న రిలీజ్ కు సిద్దమయ్యింది. ఈ చిత్రంలో నవీన్ సరసన రాశీ సింగ్ నటించింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇదొక పక్కా పొలిటికల్, క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది.


10 ఏళ్ల సర్వీసులో ఏకంగా 55 సార్లు ట్రాన్స్‌ఫర్ అయిన ఒక సిన్సియర్ కానిస్టేబుల్ త్రిమూర్తులు. ప్రతిచోటా తప్పులు బయటపెట్టడంతో అతనిని ట్రాన్స్‌ఫర్ చేస్తూనే ఉంటారు. ఒక సాధారణ కానిస్టేబుల్ అనుకోకుండా జనబలం పార్టీ అధ్యక్షురాలి పనికి అడ్డుపడతాడు. దాంతో త్రిమూర్తులు లైఫ్ మారిపోతుంది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక సెన్సేషనల్ కేసును తిరగతొడి.. సీఎంకే చెమటలు పట్టిస్తాడు త్రిమూర్తులు. అసలు ఆ కేసు ఏంటి.. ? ఆ కేసుకు, ప్రస్తుత రాజకీయాలకు ఉన్న లింక్ ఏంటి? ఒక సాదాసీదా కానిస్టేబుల్ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కోటలను ఎలా బద్దలుకొట్టాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


త్రిమూర్తులుగా వడ్డే నవీన్ లుక్, సిన్సియారిటీ, యాక్షన్ సీన్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వడ్డే నవీన్ కి ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయని తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ట్రైలర్‌ను బాగా ఎలివేట్ చేశాయి. వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా ఒక పక్కా విందు కానుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ సినిమాతో వడ్డే నవీన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Jun 12 , 2026 | 10:10 PM