ఈసారి సంక్రాంతి మాములుగా ఉండదు..
ABN , Publish Date - Jun 20 , 2026 | 08:01 PM
రాబోయే సంక్రాంతికి సినిమా సందడి ఆషామాషీగా లేదని చెప్పొచ్చు. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ తో పాటు పలువురు యంగ్ హీరోస్ కూడా పొంగల్ బరిలో హంగామా చేసేందుకు రెడీ అవుతున్నారు. దాంతో సినీ ఫ్యాన్స్ అందరి చూపు సంక్రాంతివైపే సాగుతోంది.
రాబోయే సంక్రాంతికి సినిమా సందడి ఆషామాషీగా లేదని చెప్పొచ్చు. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ తో పాటు పలువురు యంగ్ హీరోస్ కూడా పొంగల్ బరిలో హంగామా చేసేందుకు రెడీ అవుతున్నారు. దాంతో సినీ ఫ్యాన్స్ అందరి చూపు సంక్రాంతివైపే సాగుతోంది. ఈ తరం డైరెక్టర్స్ లో పొంగల్ వీరుడు అనిపించుకున్నారు అనిల్ రావిపూడి... ఆయన దర్శకత్వంలో రూపొంది సంక్రాంతికి రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 2, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు వంటి చిత్రాలు బంపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సారి వెంకటేశ్ - కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రం జనవరి 13న రిలీజ్ అవుతుందని అప్పుడే టముకు సాగుతోంది. ఈ చిత్రానికి సంక్రాంతి సరుకు అనే టైటిల్ కూడా నిర్ణయిస్తారని తెలుస్తోంది. ఇలా పొంగల్ హంగామాకు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేశ్- కళ్యాణ్ రామ్ సిద్ధమవుతున్నారు. వెంకటేశ్ తో వరుస విజయాలు చూసిన అనిల్ రావిపూడి ఈ మూవీతోనూ సక్సెస్ రూటులోనే సాగుతారని సినీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో వెంకటేశ్ మూవీ పొంగల్ కు ఖరారయింది. ఇక చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం కూడా 2027 సంక్రాంతికే రానుంది. నాగార్జున వందో చిత్రం లాటరీ కింగ్ ను దసరాకు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి ఈ మూవీ డిసెంబర్ లో రానుందని తెలుస్తోంది. ఒకవేళ డిసెంబర్ లో ఆలస్యమైతే నాగ్ నూరవ సినిమా కూడా సంక్రాంతికే వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ ఈ యేడాదే వెలుగు చూడనుంది. బాలయ్యతో కొరటాల శివ తెరకెక్కించబోయే చిత్రం సంక్రాంతికి రానుందని తెలుస్తోంది. ఇలా రాబోయే సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ మూవీస్ రానున్నాయని సమాచారం. అదే జరిగితే ఈ నలుగురు సీనియర్ స్టార్స్ పొంగల్ బరిలో పోటీపడడం ఇదే మొదటిసారి అవుతుంది.
ఓ వైపు సీనియర్ స్టార్స్ మాత్రమే కాకుండా మరోవైపు యంగ్ హీరోస్ కూడా రాబోయే సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నారు.ఈ యేడాది వేసవిలో వెలుగు చూస్తుందనుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన టాక్సిక్ డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని వినిపిస్తోంది. అప్పుడు కాకపోతే ఈ మూవీ తప్పకుండా పొంగల్ బరిలోనే దూకుతుందని తెలుస్తోంది. ఇక సూర్య హీరోగా రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ తరువాత ఆయన నటించబోయే 47వ చిత్రాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని ఆశిస్తున్నారు. శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కూడా సంక్రాంతి సంబరాల్లోనే వెలుగు చూడనుందని తెలుస్తోంది. ఇలా యంగ్ హీరోస్ పొంగల్ బెర్త్ ను ఖరారు చేసుకుంటున్నారు. వీరిలో సంక్రాంతికే వచ్చి శర్వానంద్, సూర్య హిట్స్ చూసిన సందర్భాలున్నాయి... కాబట్టి వీరిద్దిరివైపు సినీజనం ఈ సారి ఏం చేస్తారో అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇలా ఈసారి సంక్రాంతికి బిగ్గెస్ట్ ఫైట్ నడవబోతోంది. మరి ఈ ఫైట్ లో గెలిచేది ఎవరు..? ఓడేది ఎవరు..? అని తెలియాలంటే సంక్రాంతి వచ్చేవరకు ఆగాల్సిందే.