ఐ బొమ్మ ర‌వికి.. బెయిల్ మంజూరు! ఇంటర్‌నెట్.. వినియోగంపై కఠిన ఆంక్షలు

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:26 PM

మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు అయింది.

ibomma ravi

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన టాలీవుడ్ మూవీ పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మంది రవి (Ibomma Ravi) కి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతేగాక‌ ప్రతిరోజూ సీసీఎస్ కార్యాలయానికి హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. తన పాస్‌పోర్ట్‌ను కోర్టులో జమ చేయాలని, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా రవి ఇంటర్‌నెట్ వినియోగంపై కూడా కఠిన ఆంక్షలు విధించింది. స్వయంగా ఎలాంటి ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని ఉపయోగించకూడదని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సి వస్తే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని పేర్కొంది.

ఇక రవిపై సినిమా పైరసీ, కాపీరైట్ ఉల్లంఘనలు, ఐటీ చట్టం ఉల్లంఘన, మనీ లాండరింగ్ సహా మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో భాగంగా అతడు సినిమాల ప్రింట్లను విదేశీ వనరుల ద్వారా కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. సాధారణ ప్రింట్ కోసం 100 డాలర్లు, హెచ్‌డీ ప్రింట్ కోసం 200 డాలర్లు చెల్లించినట్టు సమాచారం.

పోలీసులు రవికి సంబంధించిన ఏడు బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. వాటిలో సుమారు రూ.13.40 కోట్ల నిధులు ఉన్నట్లు తేలింది. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రకటనల ద్వారా రూ.1.78 కోట్లు సమకూర్చుకున్నట్టు విచారణలో బయటపడింది. అదనంగా, రవి తన సోదరి చంద్రిక ఖాతాకు సుమారు రూ.90 లక్షలు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలు ఎక్కువగా డాలర్ల రూపంలోనే జరిగినట్టు దర్యాప్తులో వెల్లడైంది. వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఇండస్ట్రీ వర్గాల్లో మళ్లీ ఈ కేసుపై చర్చ మొదలైంది.

Updated Date - Feb 17 , 2026 | 06:26 PM