Tollywood exhibitors: సింగిల్ స్క్రీన్స్ ను కాపాడటం కోసమే మా పోరాటం..
ABN , Publish Date - May 02 , 2026 | 10:51 AM
మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ నుంచి శశిధర్ శుక్రవారం విడుదల చేసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కౌంటర్ ఇస్తూ శనివారం ఎగ్జిబిటర్స్ స్పందించారు.
థియేటర్స్ పర్సంటేజ్ విషయంలో టాలీవుడ్‌లో కొంతకాలంగా వివాదాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. పర్సంటేజ్ విధానానికి అంగీకరిస్తేనే థియేటర్స్ అని తెలంగాణ ఎగ్జీబిటర్స్ అంటున్నారు. పర్సంటేజ్ సిస్టమ్‌తో నడిచే సినిమా హాళ్లకు తమ చిత్రాలను ఇవ్వబోమని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఈ ఇష్యూ నడుస్తున్న తరుణంలో మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఈ శుక్రవారం ‘జెట్లీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పర్సంటేజ్ సిస్టమ్ పంచాయతీ సింగిల్‌స్క్రీన్స్ థియేటర్స్‌కు మాత్రమే. మల్టీప్లెక్స్‌లకు దీనితో సంబంధం లేదు. అయినా మైత్రీ సంస్థ తీసిన ‘జెట్లీ’ సినిమాను మల్టీప్లెక్స్ థియేటర్లలో నిలిపేశారు. దీంతో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ నుంచి శశిధర్ శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు. దానితో ప్రస్తావించిన అంశాలకు కౌంటర్ ఇస్తూ శనివారం ఎగ్జిబిటర్స్ స్పందించారు.
‘తెలంగాణాలో కొన్ని సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల విషయంలో వారానికి రెంట్, రెవెన్యూ షేరింగ్ అంశాలపై వివాదం నడుస్తోందని మాకు తెలుసు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలను మీరు ఆ థియేటర్లలో ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నారని అర్థం చేసుకున్నాం. మా గత సినిమాల విషయంలో కూడా ఇదే విధానం నడిచింది. దానిని మేము గౌరవించాం. కానీ, మా తాజా చిత్రం ‘జెట్‌లీ’ విషయంలో జరిగినది మాత్రం ఆమోదయోగ్యం కాదు’ కాదని మైత్రీ శశి పేర్కొన్న విషయంపై ఎగ్జిబిటర్స్ తిరిగి సమాధానమిచ్చారు.
‘అయితే కొన్నేళ్లగా మేం ఒకటే చెబుతున్నాం. థియేటర్లలో సినిమాల రన్ తగ్గిపోవడం వల్ల సింగిల్ స్క్రీన్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. ఇండస్ట్రీని, థియేటర్‌లను కాపాడుకోవాలంటే అందరం కలిసి పనిచేయాలి. ఇక్కడ సమానమైన వ్యవస్థ అవసరం. థియేటర్లలో తగ్గిన రన్ అనేది వైరస్ అనుకుంటే.. దానికి పర్సంటేజ్ షేరింగ్ విధానం అనేది వ్యాక్సిన్ అని మేం భావిస్తున్నాము. లేదంటే సింగిల్ స్క్రీన్స్ పూర్తిగా అంతరించిపోతారు.
ఇక మల్టీప్లెక్స్‌లో సినిమా నిలిపివేత విషయానికొస్తే.. ఇది అసలు సమస్యతో సంబంధం లేదని మీరు చెప్పలేరు. మీరు ‘రెంట్-లేదా-పర్సంటేజ్’ విధానాన్ని బలవంతంగా రుద్దాలనుకుంటున్నారు. కానీ థియేటర్ యాజమాన్యం పర్సంటేజ్ విధానాన్ని కోరుకుంటుంది. మీరు, మీ కార్యాలయం నిజంగా చర్చకు సిద్థంగా ఉంటే, చాంబర్ ద్వారా వచ్చిన మీటింగ్ పిలుపునకు మీరు స్పందించి ఉండాలి. సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో మీరు ఎప్పుడూ లేరు. పర్సెంటేజ్-షేరింగ్’ విధానానికి అంగీకరించి, సింగిల్ స్క్రీన్స్ ను రక్షించేందుకు మీరు సానుకూలంగా స్పందిస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము. దయచేసి సింగిల్ స్క్రీన్స్ ను కాపాడండి’ అని ఎగ్జిబిటర్స్ తమ లేఖలో పేర్కొన్నారు.

