సెకండాఫ్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ జోరు.. థియేటర్లకు క్యూ కడుతున్న జనం!
ABN , Publish Date - Aug 24 , 2026 | 10:17 AM
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వరుసగా కొత్త సినిమాలు వస్తున్నా.. మంచి కంటెంట్ ఉంటే థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. గత రెండు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కనిపిస్తున్న ఈ జోరు తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.
సెకండాఫ్ కలిసొచ్చింది! థియేటర్లకు జై కొడుతున్న జనం
‘మా సినిమా చాలా బాగా ఆడుతోందండీ.. థియేటర్లకి రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారు. ఫుట్‌ఫాల్స్ బావున్నాయి. కలెక్షన్లు చూసుకుంటుంటే కడుపు నిండిపోతోంది’ అంటూ నిర్మాతలు మనస్ఫూర్తిగా చెప్పే మాటలు విని చాలా రోజులైంది. రెండు నెలల నుంచి టాలీవుడ్ బాక్సాఫీసు కళకళలాడుతుండడం.. వీకెండ్ వస్తే చాలు హౌస్‌ఫుల్ బోర్డులు చాలా థియేటర్ల దగ్గర కనిపిస్తుండడమే దీనికి కారణం. ముఖ్యంగా ఈ రెండు నెలల కాలంలో విడుదలైన చిత్రాలకు టికెట్ రేట్ పెంపుదల లేకపోవడంతో ‘సినిమా బాగుంది’ అని టాక్ వస్తే చాలు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఓటీటీల్లో ఎన్నో సినిమాలు వస్తున్నా జనం థియేటర్లకు వెళ్లడానికే ఆసక్తి చూపిస్తుండడం తెలుగు సినిమాకు శుభ పరిణామం.
ఇక ముందు కూడా కొత్తగా విడుదలయ్యే చిత్రాలకు కూడా ఇలా టికెట్ రేట్లు పెంచకుండా ఉంటే బాగుండుననే కోరిక ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ఇలా కలెక్షన్ల ప్రభంజనంతో మొన్న మొన్నటిదాకా వెంటిలేటర్ మీదున్న తెలుగు సినిమా పరిశ్రమను పాజిటివ్ మోడ్‌లోకి షిఫ్ట్ చేసిన చిత్రాలేవి? ఆ రూట్లోనే మార్చ్‌ఫాస్ట్ చేసిన మిగిలిన మూవీస్ ఏవి? ఆలస్యం ఎందుకు ఓ సారి గుర్తుచేసుకుందాం...
కుతూహలం పెంచిన కాన్సెప్ట్
నిధులు, సర్పాల కాన్సెప్ట్ మన ప్రేక్షకులకు ఎప్పుడూ కుతూహలాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఆ పాయింట్‌తోనే నాగబంధం చిత్రాన్ని తెరకెక్కించారు అభిషేక్ నామా. ఈ సినిమా అంతగా ఆడకపోయినా మొదటి మూడు రోజులు వచ్చిన వసూళ్లు బయ్యర్స్‌ను సేఫ్ పొజిషన్‌లో ఉంచాయి.
ఫ్యామిలీ బంగారం
సమంత సొంత బ్యానర్ ట్రాలాలా పిక్చర్స్ మీద మా ఇంటి బంగారం చిత్రాన్ని నిర్మిస్తే కాసుల వర్షం కురిసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే కథ, సన్నివేశాలు రాసుకుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారని ప్రూవ్ చేసింది. ఓ వైపు ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవడానికి కృషి చేస్తూనే, తరుముతున్న గతం నుంచి తనను తాను కాపాడుకునే మహిళగా మా ఇంటి బంగారం సినిమాలో మెప్పించారు సామ్. తెలుగులో రూ. 100కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన తొలి మహిళ ప్రాధాన్య చిత్రమిదని మేకర్స్ ప్రకటించారు.
ద్రౌపదమ్మ సాక్షిగా...
ద్రౌపదమ్మ మిట్టన భారతం ఎంత ఇంపుగా ఉంటుందో, తిరునాళ్లు ఎంత సంబరంగా జరుగుతాయో.. అంతే హ్యాపీగా ఉన్నారు అక్కినేని చిన్నోడు అఖిల్. ఇది కదా ఇన్నాళ్లుగా మేం కోరుకున్న హిట్ అంటున్నారు అక్కినేని అభిమానులు. కథ లోకల్ అయినా సక్సెస్ గ్లోబల్ అంటూ శ్రీరామపురంలో జరిగిన కథను ఇష్టంగా షేర్ చేసుకున్నారు నిర్మాతలు నాగార్జున, సూర్యదేవర నాగవంశీ. దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరి ఈ చిత్రంతో డిస్టింక్షన్‌లో పాస్ అయ్యి ‘లెనిన్’ను రూ. 100కోట్ల క్లబ్‌లో చేర్చాడని మేకర్స్ ప్రకటించారు.
మామూలు ప్రేమకథ కాదు!
నచ్చిన అమ్మాయి కోసం సమాధి నుంచి కూడా లేచి వచ్చే ప్రియుడి కథతో ‘చెన్నై లవ్ స్టోరీ’ తెరకెక్కితే జనాలందరూ వాహ్వా వాహ్వా అని మెచ్చుకున్నారు. తొలిప్రేమేం తోపు కాదు అంటూ సందేశాన్నివ్వడానికి ప్రయత్నిస్తూనే, ప్రేమలో ఉండే పొసెసివ్‌నె్‌సని జాగ్రత్తగా డీల్ చేసి సిల్వర్‌స్ర్కీన్ మీద ప్రెజెంట్ చేశారు డైరక్టర్ రవి నంబూరి. హీరో కిరణ్ అబ్బవరం, నిర్మాతలు ఎస్‌కేఎన్, సాయిరాజేష్ ఈ సినిమాతో తమ ఖాతాలో మరో హిట్‌ను చేర్చుకున్నారు. సినిమాను కొన్న బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు కూడా పొందారు.
కనకరాజు గారడీ
మా వరుణ్‌కి బంపర్ హిట్ వచ్చేసింది. ఈ అదృష్టం వాళ్లబ్బాయిది అంటూ మెగాస్టార్ చిరంజీవి చేత పొగడ్తలు అందుకున్న సినిమా కొరియన్ కనకరాజు. స్టఫ్ ఉన్న డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాతో ఇండస్ట్రీలో తన ప్లేస్‌ని ఇంకాస్త సుస్థిరం చేసుకున్నారు. సత్య కామెడీ టైమింగ్, వరుణ్ పెర్ఫార్మెన్స్ థియేటర్లలో ఆడియన్స్ మెప్పు పొందాయి. ఫలితంతో మేకర్స్ దిల్‌ఖుష్.
డైరక్టర్ హీరోగా మారి
వరుస సక్సె్‌సలతో దూసుకుపోతున్న డైరక్టర్, సడన్‌గా హీరోగా మారి మేకప్ వేసుకుని సినిమా చేస్తే రిజల్ట్ మీద ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. ఆ క్యూరియాసిటీని సిల్వర్ స్క్రీన్ మీద కలర్‌ఫుల్‌గా మార్చేశారు డీసీ మేకర్స్. లోకేష్ కనగరాజ్ హీరో, వామికా గబ్బి నాయిక. ఇద్దరూ కలిసి స్ర్కీన్ మీద చెడుగుడు ఆడేశారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే రూ. 100కోట్ల వసూళ్లను అందుకుందని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రకటించింది.
ఫుల్ ప్యాకేజ్
ఫ్యామిలీ సెన్సిబిలిటీస్, మంచి మనుషులు, వారి మనసులు, పెళ్లి వద్దనుకునే హీరో, ఫుల్ ట్రెండ్‌లో ఉన్నా పద్ధతిగా ఉంటే హీరోయిన్, తల్లీకొడుకుల అనుబంధం.. ఇలా ఫుల్ ప్యాకేజ్‌గా ప్రేక్షకులను పలకరించిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వరుస విజయాలతో దూసుకుపోతున్న వెంకీ అట్లూరి, తన మార్కు రైటింగ్‌తో, మేకింగ్‌తో మెస్మరైజ్ చేశారు. కథలో ఇలా దమ్ముంటే, గ్రాఫిక్స్, వీయ్‌ఫఎక్స్ మాకెందుకు అంటూ ప్రేక్షకులే ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇచ్చిన ఈ సినిమా యునానిమస్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ హిట్‌తో తెలుగులో దెబ్బతిన్న తన మొత్తం మార్కెట్‌ను తిరిగి తెచ్చేసుకున్నారు సూర్య. ఈ సినిమా రూ 200 కోట్లపై చిలుకు వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్ తెలిపింది.
సక్సెస్ సెంటిమెంట్
నాకో బలహీనత ఉంది. ఊళ్లో ఉన్న ఆడకూతుళ్లందరినీ నా కూతుళ్లనుకుంటాను అంటూ రవితేజ చెప్పిన ఒక్క డైలాగ్ ‘ఇరుముడి’ మీద ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేసింది. దానికి తోడు అయ్యప్ప స్వామి మాలధారణ విషయం, థ్రిల్లింగ్ అంశాలు.. అన్నీ కలిపి సినిమాను సూపర్ సక్సెస్ చేశాయి. రవితేజకి యునానిమస్ హిట్ అంటూ జనాలు మెచ్చుకున్నారు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది కానీ ఇంత కలెక్షన్ల సునామీని నిర్మాతలు కూడా ఊహించలేదు. అలాగే తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్, రెండు అయ్యప్ప పాటలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 47 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా సాగిపోతోంది. మరో రెండు వారాల పాటు ఈ జోరు కొనసాగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.