సంక్రాంతి పోరు.. ఎవరైనా తప్పుకుంటారా
ABN , Publish Date - Aug 23 , 2026 | 09:34 PM
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించే అతిపెద్ద పండుగ సీజన్ సంక్రాంతి. అందుకే ప్రతి ఏటా తమ సినిమాలను సంక్రాంతి బరిలోనే విడుదల చేయాలని ఇండస్ట్రీలోని హీరోలందరూ కాచుకుని కూర్చుంటారు.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించే అతిపెద్ద పండుగ సీజన్ సంక్రాంతి. అందుకే ప్రతి ఏటా తమ సినిమాలను సంక్రాంతి బరిలోనే విడుదల చేయాలని ఇండస్ట్రీలోని హీరోలందరూ కాచుకుని కూర్చుంటారు. దానికి తగ్గట్లే రాబోయే పండుగ సీజన్‌లో టాలీవుడ్‌లోని దాదాపు అందరు అగ్ర కథానాయకులు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ వంటి సీనియర్ స్టార్లతో పాటు, ఈసారి యంగ్ అండ్ క్రేజీ కుర్ర హీరోలు కూడా తమ సినిమాలతో పండుగ రేసులోకి దిగుతున్నారు.
ఇప్పటికే జనవరి 12 విడుదల అంటూ అనిల్ రావిపూడి, వెంకటేష్ తో రేస్ లో దిగుతుంటే.. చిరంజీవి సైతం కాకాతో సంక్రాంతి బరిలో ఉన్నట్లు తెలిపారు. ఇక బాలయ్య- గోపీచంద్ మలినేని కూడా పొంగల్ కే అని అంటున్నారు. ఇక అక్కినేని నాగార్జున కూడా కింగ్ 100 తో రేసులో ఉన్నాడని టాక్. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ బరిలో ఉంటే.. మేము కూడా పండక్కే వస్తామని శ్రీవిష్ణు, సాయి తేజ్, శర్వానంద్ కాచుకొని కూర్చున్నారు. అయితే, ఒకేసారి ఇన్ని పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకే సమయంలో ఇన్ని చిత్రాలు థియేటర్లలోకి వస్తే ప్రధానంగా థియేటర్ల కేటాయింపులో తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా, కావాల్సినన్ని స్క్రీన్లు దొరక్కపోతే కలెక్షన్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రతీ సినిమా ఓపెనింగ్ వసూళ్లపై మరియు ఫుల్ రన్ కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
రూ. వందల కోట్ల బిజినెస్ దాగి ఉన్న సీజన్ కాబట్టి, ప్రతి నిర్మాత కూడా తమ చిత్రానికి గరిష్ట సంఖ్యలో థియేటర్లను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ పరిమితంగా ఉండే థియేటర్ల సంఖ్య దృష్ట్యా ఈ క్లాష్‌ను తట్టుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో థియేటర్ల సమస్య, వసూళ్ల నష్టాన్ని నివారించడానికి ఏ హీరో అయినా వివేకంతో ఆలోచించి పండుగ రేసు నుంచి తమ చిత్రాన్ని వెనక్కి తీసుకుంటారా లేక రిస్క్ తీసుకుని బాక్సాఫీస్ వద్ద నేరుగా తలాపడతారా అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర ఆసక్తికరంగా మారింది. మరి సీనియర్ హీరోల కోసం కుర్ర హీరోలు తగ్గుతారా.. లేదా సీనియర్ హీరోలే వెనకడుగు వేస్తారా అనేది చూడాలి.