ఫస్ట్ క్వార్టర్ లో టాలీవుడ్ తీరు....

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:37 AM

చూస్తూండగానే 2026లో మూడు నెలలు ముగిసిపోతున్నాయి. మరి ఈ మూడు నెలల్లో మన తెలుగు సినిమా ఎలా సాగిందో ఓ సారి గుర్తు చేసుకుందాం.

Tollywood

'జమ్ జమ్ జంబల్ బరి... జనవరి వస్తోంది మరి...' అంటూ తెలుగు సినీజనం ఈ సారి సినిమా సందడితో సాగాలని ఆశించారు. టాప్ స్టార్స్ అందరూ పొంగల్ బరిపైనే గురి పెట్టారు. కానీ, కొందరికే జనం జై కొట్టారు. మరి కొందరికి నిరాశనే మిగిల్చారు. జనవరిలో మొత్తం 26 చిత్రాలు వెలుగు చూశాయి. వాటిలో స్ట్రెయిట్ మూవీస్ 22 కాగా, నాలుగు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఈ యేడాది తొలుత 'సైక్ సిద్ధార్థ', 'వనవీర', 'మదం', 'సఃకుటుంబానాం' చిత్రాలు జనవరి 1వ తేదీనే జనం ముందు నిలిచాయి. కానీ, వారి మదిని గెలవలేకపోయాయి. 2వ తేదీన వచ్చిన 'నీలకంఠ, వినరా ఓ వేమ, ఓ అందాల రాక్షసి, ఘంటసాల : ది గ్రేట్, గులాబీ' చిత్రాలు కూడా ఆకట్టుకోలేక పోయాయి. అప్పటికే అందరి చూపు రెబల్ స్టార్ ప్రభాస్ 'ద రాజా సాబ్' (The Raja Saab) పైనే సాగుతోంది. ఇక చిన్న చిత్రాలను ఎవరు పట్టించుకుంటారు. జనవరి 9వ తేదీన 'ద రాజాసాబ్' జనం ముందు నిలచి, తీవ్ర నిరాశను కలిగించింది.


తెలుగు సినిమాకు ఆక్సిజన్ లాంటిది సంక్రాంతి సీజన్. అందువల్ల టాప్ స్టార్స్ తో చిత్రాలు నిర్మించేవారందరూ పొంగల్ బరిలోనే దూకాలని ఆశిస్తారు. 9వ తేదీన వచ్చిన 'ద రాజా సాబ్' నిరాశ కలిగించినా, జనవరి 12న వెలుగు చూసిన 'మన శంకరవరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu) బంపర్ హిట్ గా నిలచింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం అదరహో అదరహా అనిపించింది. వెంకటేశ్ కూడా ఓ కీ రోల్ లో కనిపించడం ఈ చిత్రంలో ఓ ప్రధానాకర్షణ. 400 కోట్ల రూపాయలు పోగేసి ఈ యేడాది ఇప్పటి దాకా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలచింది 'మన శంకరవరప్రసాద్ గారు'. లాస్ట్ ఇయర్ 'సంక్రాంతికి వస్తున్నాం'తో పొంగల్ బ్లాక్ బస్టర్ పట్టేసిన అనిల్ రావిపూడి ఈ సారి కూడా అదే మ్యాజిక్ చేయడం విశేషం.

'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజైన మరుసటి రోజునే జనవరి 13న రవితేజ హీరోగా రూపొందిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' విడుదలయింది. అయితే 'మన శంకరవరప్రసాద్ గారు' ప్రభంజనం ముందు నిలవలేక పోయింది. 14వ తేదీన రిలీజైన 'అనగనగా ఒకరాజు', (Anaganaga Oka Raju) 'నారీ నారీ నడుమ మురారి' (Naari Naari Nuduma Murari) రెండు చిత్రాలు గుడ్ టాక్ ను సంపాదించాయి. వీటిలో నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన 'అనగనగా ఒకరాజు' వంద కోట్లు పోగేసి అందరినీ ఆశ్చర్య పరచింది. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన 'నారీ నారీ నడుమ మురారి' సైతం అలరించింది. అయితే 'మన శంకర వరప్రసాద్ గారు' తరువాత పొంగల్ రేసులో నంబర్ టూ ప్లేస్ ను నవీన్ పోలిశెట్టి దక్కించుకున్నారు. జనవరి 30న 'ఓం శాంతి శాంతి శాంతిః, జగన్నాథ్‌, జమానా, ధృతరాష్ట్రుడు, దేవగుడి, ప్రేమకడలి, త్రిముఖ , వన్ బై ఫోర్' చిత్రాలు ప్రేక్షకులను పలకరించినా, వారిని పులకరింప చేయలేక పోయాయి.


ఈ యేడాది తక్కువ రోజులున్న నెల ఫిబ్రవరిలోనే ఇప్పటికి ఎక్కువ సినిమాలు రిలీజ్ కావడం విశేషం! రెండో నెల ఫిబ్రవరిలో 24 స్ట్రెయిట్ పిక్చర్స్ తో పాటు 5 డబ్బింగ్ మూవీస్ తో కలిపి మొత్తం 29 సినిమాలు జనం ముందు నిలిచాయి. ఫిబ్రవరి 6న ముందుగా 'ఎర్రచీర, లగ్గం టైమ్ ఆపరేషన్‌ పద్మ, బరాబర్ ప్రేమిస్తా, శ్రీచిదంబరం గారు, యుఫోరియా, సుమతీ శతకం, బ్లడ్ రోజెస్, హనీ, దక్షిణ కాళీ' రిలీజయ్యాయి. గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో రూపొందిన 'యుఫోరియా' ఆలోచింప చేసిందే కానీ ఆకట్టుకోలేక పోయింది. మిగతా చిత్రాలు ఊసులోకే లేకుండా పోయాయి. ఫిబ్రవరి 13న విష్వక్ సేన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ఫంకీ' వచ్చి ఆకట్టుకోలేక పోయింది. మరుసటి రోజునే వచ్చిన 'కపుల్ ఫ్రెండ్లీ' యువతను అలరించింది. సంతోష్ శోభన్ కు నటునిగా మంచి మార్కులే సంపాదించి పెట్టింది 'కపుల్ ఫ్రెండ్లీ'.. తరువాత వచ్చిన ఫిబ్రవరి సినిమాలేవీ మురిపించలేక పోయాయి. అలా ఫిబ్రవరి సంఖ్యాబలం చూపినా బలగాన్ని కూడగట్టలేకపోయాయి.

మార్చి నెలలో ముందుగా 5వ తేదీన 'విధాత, చెష్మా రాజా - సెల్ఫీ రాణి' థియేటర్లకు వచ్చాయి. మరుసటి రోజున వెలుగు చూసిన చిత్రాల్లో శివాజీ, లయ జంటగా రూపొందిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' కాస్త ఆసక్తి రేపింది - కానీ ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాతో పాటే వచ్చిన 'కాక్రోచ్', 'మృత్యుంజయ్', 'మెన్షన్ హౌస్ మల్లేష్' వంటివి కూడా మెప్పించలేకపోయాయి. మార్చి నెలలో 19వ తేదీ వైపే పలువురి చూపు సాగింది. ఎందుకంటే ఆ తేదీన పాన్ ఇండియా మూవీస్ అయిన 'ధురంధర్-2', 'టాక్సిక్' మధ్య పోటీ ఉంటుందనుకుంటే ఇరాన్ వార్ కారణంగా గల్ఫ్ కంట్రీస్ లో ఇండియన్ మూవీస్ కు దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో 'టాక్సిక్' పోటీ నుండి తప్పుకుంది. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓ వారం ముందుకు జరిగి మార్చి 19న వెలుగు చూసింది. అంతకు ముందు పవన్- హరీశ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'గబ్బర్ సింగ్' కారణంగా ఈ మూవీకి కాసింత క్రేజ్ ఉండేది. ఎందువల్లో ఆ క్రేజ్ కూడా కరిగిపోయి, అసలు పవన్ కళ్యాణ్ మూవీనేనా ఇది అనే తీరున 'ఉస్తాద్ భగత్ సింగ్' సాగింది. ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది.


మార్చి నెలలో 26వ తేదీన 'బ్యాండ్ మేళం, లేచింది మహిళా లోకం' చిత్రాలు 27న 'సుయోధన' సినిమా వచ్చాయి. ఏవీ ఆకట్టుకోలేక పోయాయి. మార్చిలో 8 డబ్బింగ్ సినిమాలు రిలీజయ్యాయి. స్ట్రెయిట్ మూవీస్ 14 మాత్రమే విడుదలయ్యాయి. వెరసి 2026 మూడో నెలలో 22 చిత్రాలే వెలుగు చూశాయి. ఈ నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా అని చెప్పొచ్చు. రణవీర్ కపూర్ హీరోగా ఆదిత్య ధర్ రూపొందించిన 'ధురంధర్' గత యేడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. ఆ క్రేజ్ తో సీక్వెల్ అయిన 'ధురంధర్-ద రివేంజ్'ను కూడా జనం ఆదరించారు. దాదాపు నాలుగు గంటల రన్ టైమ్ ఉన్న 'ధురంధర్-2' ప్రేక్షకులను అలరిస్తూ సాగుతోంది. చివరలో వచ్చిన తమిళ డబ్బింగ్ 'యూత్' పరవాలేదనిపించుకుంది. ఇలా ఇప్పటి దాకా ఈ మూడు నెలల్లో వచ్చిన మొత్తం 77 చిత్రాల్లో కేవలం ఆరు చిత్రాలే ఆకట్టుకోగలిగాయి. అందులో 'మన శంకర వరప్రసాద్ గారు' బ్లాక్ బస్టర్ కాగా, అనువాదాల్లో 'ధురంధర్-2' ఆధిక్యత చాటుకుంది. రాబోయే మాసాల్లో మన తెలుగు సినిమా ఏ తీరున సాగుతుందో చూడాలి.

Updated Date - Mar 30 , 2026 | 11:48 AM