HighCourt: చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు.. హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Jan 08 , 2026 | 07:17 AM
చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, ప్రభాస్ మూవీ’ టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు డివిజన్ బెంచ్ స్వేచ్ఛ ఇచ్చింది.
వినోదం అంటే తాగునీటి తరహాలో అత్యవసర వస్తువో.. నిత్యావసర సరుకో కాదని తెలంగాణ హైకోర్టు ( Telangana High Court) డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. పెంచిన టికెట్ రేటు పెట్టి సినిమా చూడాలా? వారం రోజుల తర్వాత సాధారణ టికెట్ రేటుకు సినిమా చూడాలా? అనేది వినియోగ దారులు నిర్ణయించుకుంటారని పేర్కొంది. పెంచిన టికెట్ రేట్లు నచ్చకపోయినా లేదా అంత ధర పెట్టలేకపోయినా వారం రోజుల తర్వాత సాధారణ టికెట్ రేట్లకు సినిమా చూడవచ్చని పేర్కొంది. ప్రస్తుతం తమ ముందు ఉన్న పిటిషన్లు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కాదని.. కొంతమంది పిటిషనర్లు వ్యక్తిగత హోదాలో సింగిల్ జడ్జి వద్ద రిట్ పిటిషన్‌లు దాఖలు చేశారని తెలిపింది. సదరు పిటిషన్‌లలో ‘టికెట్ రేట్లు పెంచరాదు’ అని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అన్ని సినిమాలకు వర్తింపజేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
సింగిల్ జడ్జి వద్ద దాఖలైన పిటిషన్లు కేవలం ‘ఓజీ, పుష్ప-2, గేమ్‌ఛేంజర్’ సినిమాల టికెట్ రేట్లు పెంచరాదని మాత్రమే దాఖలయ్యాయని గుర్తుచేసింది. కాబట్టి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కేవలం ఆ మూడు సినిమాలకే వర్తిస్తాయని పేర్కొంది. ‘మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu), ప్రభాస్’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు సదరు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ సినిమా టికెట్ రేట్లు పెంచే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి స్వేచ్ఛ ఇచ్చింది. ఈ మేరకు తమ సినిమాల టికెట్ రేట్ల పెంపునకు అడ్డంకిగా ఉన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేయాలని పేర్కొంటూ నిర్మాణ సంస్థలు షైన్ స్ర్కీన్స్ ఎల్‌ఎల్‌పీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దాఖలు చేసిన రిట్ అప్పీళ్లను ముగించింది.
ఏపీలో.. టికెట్ ధర రూ. 1000! జీవో జారీ
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన హర్రర్ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వెసులుబాటు కల్పించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దీని ప్రకారం నేటి సాయంత్రం నుంచి అర్థరాత్రి మధ్యలో ఒక ప్రత్యేక షోకు అనుమతినిచ్చింది. టికెట్‌ఽ దరను జీఎస్టీతో కలిపి రూ. 1000గా నిర్ణయించారు. సినిమా విడుదల తేదీ అయిన జనవరి 9 నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి లభించింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్‌పై అదనంగా రూ. 150, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌పై అదనంగా రూ. 200 వరకూ పెంచుకోవచ్చు. అలాగే రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది.