ఎన్టీఆర్ ఇంట.. అరుదైన పెయింటింగ్!
ABN , Publish Date - Nov 26 , 2026 | 09:16 AM
ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం ప్రత్యేకంగా రూపొందించిన ఒరిజినల్ పెయింటింగ్‌ను జూనియర్ ఎన్టీఆర్ తన ఇంటికి తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని ఫొటోలతో సహా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
వెండితెరపై తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కళల పట్ల తనకున్న అభిరుచిని మరోసారి చాటుకున్నారు. ప్రముఖ తెలుగు చిత్రకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత తోట వైకుంఠం (Thota Vaikuntam) ప్రత్యేకంగా రూపొందించిన ఒరిజినల్ పెయింటింగ్ (Original Painting) ను తారక్ తన సొంతం చేసుకున్నారు. ఇటీవల తన నివాసాన్ని ఆధునిక హంగులతో పునరుద్ధరించుకున్న ఎన్టీఆర్.. ఇంటి అలంకరణలో భాగంగా తన అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి ఈ చిత్రాన్ని తయారు చేయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తోట వైకుంఠం స్వయంగా ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి ఈ కళాఖండాన్ని ఆయనకు అందజేశారు. ఇక ఎన్టీఆర్ కోసం తోట వైకుంఠం రూపొందించిన పెయింటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, అమ్మ వారు సంప్రదాయ గ్రామీణ వాతావరణంలో కొలువుదీరినట్లు కనిపిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో భక్తులు పూజలు చేస్తున్న దృశ్యాన్ని ఎంతో అందంగా చిత్రీకరించారు. భక్తి భావంతో పాటు పల్లె సంస్కృతిని మేళవించిన ఈ కళాఖండం చూపరులను ఆకట్టుకుంటోంది.

ఈ అరుదైన పెయింటింగ్‌ను అందుకున్న ఆనందాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తోట వైకుంఠంతో కలిసి దిగిన ఫొటోలతో పాటు పెయింటింగ్ చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘లెజెండరీ ఆర్టిస్ట్ తోట వైకుంఠం గారు ప్రత్యేకంగా రూపొందించిన ఒరిజినల్ కళాఖండాన్ని ఇంటికి తీసుకురావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే.. తెలంగాణకు చెందిన తోట వైకుంఠం చిత్రకళా ప్రపంచంలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. పల్లెటూరి జీవనశైలి, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ఆయన చిత్రాల్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి. పచ్చని పొలాలు, కల్లు కుండలు మోసుకెళ్లే వ్యక్తులు, ఇంటి పనుల్లో నిమగ్నమైన మహిళలు, ఆలయ ఆచారాలు, పల్లె పండగలు వంటి అంశాలను తనదైన ప్రత్యేక శైలిలో కాన్వాస్‌పై ఆవిష్కరిస్తుంటారు. విలక్షణమైన రూపాలతో ఆయన సృష్టించే చిత్రాలకు దేశవిదేశాల్లో విశేష ఆదరణ, మంచి విలువ కూడా ఉంది.