Shavukaru Janaki: 73 ఏండ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో.. ఆ రెండు చేదు జ్ఞాప‌కాలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:15 PM

షావుకారు జానకి నటిగానే కాదు నిర్మాతగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ఆమె నిర్మించిన రెండు సినిమాలు, వాటి ఫలితాలు, కుటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చిన వారసుల గురించి ఆసక్తికర విషయాలు ఇదిగో..

sowcar janaki

షావుకారు జానకి నటిగానే కాదు నిర్మాతగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ఆమె నిర్మించిన రెండు సినిమాలు, వాటి ఫలితాలు, కుటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చిన వారసుల గురించి ఆసక్తికర విషయాలు ఇదిగో..

'షావుకారు' (Shavukaru) చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించిన జానకి (Janaki), చివరగా మూడేళ్ళ క్రితం విడుదలైన 'అన్ని మంచి శకునములే' చిత్రంలో నటించారు. వివిధ భాషల్లో దాదాపు 390 చిత్రాలలో ఆమె నటించారు. 73 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆమె రెండు సినిమాలనూ నిర్మించారు. బెంగాలీలో ఉత్తమ్ కుమార్ నిర్మించిన 'ఉత్తర్‌ ఫాల్గుణి' సినిమాను ఆమె కె. బాల చందర్ దర్శకత్వంలో 'కావియ తలైవి' పేరుతో రీమేక్ చేశారు.

బెంగాలీలో సుచిత్రాసేన్ తల్లీ కూతుళ్ళుగా నటించిన ఆ పాత్రల్ని తమిళంలో జానకి పోషించారు. 1970లో విడుదలైన ఈ తమిళ చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేదు. బెంగాలీ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డ్ అందుకుంది. షావుకారు జానకి నిర్మించిన 'కవియ తలైవి'లో హీరోగా నటించిన జెమినీ గణేశన్‌ ఉత్తమ నటుడిగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. బెంగాలీ సినిమా 'ఉత్తర్ ఫాల్గుణి' హిందీలో 'మమత'గా, మలయాళంలో 'పుష్పాంజలి'గా రీమేక్ అయ్యింది.

ఇక జానకి నిర్మించిన రెండో సినిమా 'రంగరాట్టనమ్'. కృష్ణన్‌ - పంజు దర్శకత్వ ద్వయం దీనిని తెరకెక్కించారు. ఇందులోనూ జానకితో పాటు శివాజీ గణేశన్, రవిచంద్రన్ కీలక పాత్రలు పోషించారు. 1971 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా కూడా జానకికి చేదు అనుభవాన్నే కలిగించింది. దాంతో ఆమె ఇక చిత్ర నిర్మాణం జోలికి పోలేదు. జానకి చెల్లి కృష్ణ కుమారి సినిమా రంగంలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన.. జానకి పిల్లలు ఎవ్వరూ ఈ రంగంలోకి రాలేదు.

అయితే జానకి పెద్ద కుమార్తె యజ్ఞ ప్రభ కుమార్తె వైష్ణవి (Vaishnavi) మాత్రం అమ్మమ్మ అడుగు జాడల్లో నడుస్తూ పలు చిత్రాలలో నటించింది. తెలుగులో కె. విశ్వనాథ్‌ రూపొందించిన శుభ సంకల్పం (Subha Sankalpam) లో పాత్రకు గానూ వైష్ణవి ఉత్తన సహాయనటిగా నంది అవార్డును అందుకుంది. అమ్మమ్మ జానకి నుంచి చక్కని వాచకాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్న వైష్ణవి డబ్బింగ్‌ కళాకారిణిగానూ రాణించింది. ఆ తర్వాత ఛాయాగ్రాహకుడు అరవింద్‌ను పెళ్ళి చేసుకుని, నటనకు స్వస్తి చెప్పి, కుటుంబ జీవితానికి అంకితమైంది.

Updated Date - Aug 21 , 2026 | 05:19 PM