ఈ సారి ద‌య్యం క‌రుణించేనా.. 'కొరియన్ కనకరాజు'

ABN , Publish Date - Aug 05 , 2026 | 09:26 AM

this time ghost.. will mercy on varun tej korean kanakaraju? దెయ్యాలు, భూతాల కథలు కూడా కొన్నిసార్లు జనాన్ని కట్టి పడేస్తుంటాయి. ఆ నమ్మకంతోనే మేకర్స్ ఘోస్ట్ స్టోరీస్ వెంట పరుగులు తీస్తూంటారు. ఫట్స్ పలకరించినా హిట్స్ వస్తాయనే నమ్మకంతో ఉంటారు సినీజనం. ఆ నమ్మకంతోనే 'కొరియన్ కనకరాజు' వస్తున్నాడని టాక్.

Korean Kanakaraju

వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో రూపొందిన కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) ఆగస్ట్ 7వ తేదీన జనం ముందుకు రానుంది. ఈ సినిమాలో కథ ప్రకారం కనకరాజు ఓ కొరియన్ అమ్మాయిని ప్రేమిస్తాడు..ఆ అమ్మాయి కారణంగా ఓ పాత్ర కనకరాజుకు చేరుతుంది. అక్కడ నుంచే కనకరాజు కొరియన్ భాష మాట్లాడటం, సమురై కత్తి ధరించి పోరాడటం మొదలెడతాడు. అందుకు కారణం ఓ ఆత్మ అతనిలో ప్రవేశిస్తుందట. ఈ కథతోనే వినోదం పంచే ప్రయత్నం చేశారు మేర్లపాక గాంధీ. దెయ్యాలు, భూతాల కథలు పలుమార్లు వినోదం పంచాయి. విజయం సాధించాయి. కొన్నిసార్లు పరాజయం పాలయ్యాయి కూడా. ఈ యేడాది సంక్రాంతి సంబరాల్లో ప్రభాస్ 'ద రాజాసాబ్' దెయ్యం కథతోనే వచ్చింది. భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో 'కొరియన్ కనకరాజు' పరిస్థితి ఏంటన్న అనుమానాలు కలుగుతున్నాయి.

కొరియన్ పదాలు..

ప్రతీసారి ఒకే రిజల్ట్ వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఈ మధ్యే వచ్చిన 'చెన్నై లవ్ స్టోరీ'లో హీరోనే చనిపోయి ఆత్మగా వస్తాడు. ఈ మూవీ జనాన్ని బాగానే ఆకట్టుకుంది. అందువల్ల 'కొరియన్ కనకరాజు'లోని వినోదం కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా 'కొరియన్ కనకరాజు'ను నిర్మించాయి. ఈ మూవీ మేకింగ్ లో చాలా జాప్యం జరిగినప్పటికీ అందరినీ అలరించే అంశాలున్నాయని యూనిట్ చెబుతోంది. ఈ మూవీ చూసిన వారికి ఖచ్చితంగా కొన్ని కొరియన్ పదాలైనా వస్తాయనీ అంటున్నారు. ఇందులో ఓ పాటనే కొరియన్ పదంతో రంగరించి రూపొందించడం విశేషం.

'ప్లస్'గా మారే ఛాన్స్..

'కొరియన్ కనకరాజు' చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ (Ritika Nayak) హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రలో కమెడియన్ సత్య నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. 'కొరియన్ కనకరాజు'లోని ఎంటర్ టైన్మెంట్ టిక్కెట్ కొన్న ప్రేక్షకుడికి తగిన సంతృప్తి కలిగిస్తుందని మేకర్స్ అంటున్నారు. హీరో వరుణ్‌ తేజ్ కు హిట్ రాక నాలుగేళ్ళవుతోంది. అలాగే డైరెక్టర్ మేర్లపాక గాంధీ కూడా సక్సెస్ లేక కొన్నేళ్ళవుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబో ప్రేక్షకులకు వినోదం పంచుతూ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. మరి 'కొరియన్ కనకరాజు' జనం మనసును ఏ తీరున కొల్లగొడుతుందో చూద్దాం.

Updated Date - Aug 05 , 2026 | 10:16 AM