వేగం పెంచిన తిరువీర్‌... బ్యాక్ టు బ్యాక్ మూవీస్

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:58 PM

తిరువీర్ నటిస్తున్న రెండు సినిమాలు ఈ సమ్మర్ లో వస్తున్నాయి. ఏప్రిల్ 17న 'పాపం ప్రతాప్‌' విడుదల కాబోతుండగా, ఆ వెనుకే 'భగవంతుడు' మూవీ రానుంది.

Thiruveer

యువ కథానాయకుడు తిరువీర్‌ (Thiruveer) వేగం పెంచాడు. ఈ యేడాది సమ్మర్‌లో అతను హీరోగా నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. అందులో మొదటగా ఏప్రిల్ 17న 'పాపం ప్రతాప్‌' (Paapam Prathap) మూవీ జనం ముందుకు వస్తోంది. ఇందులో పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) హీరోయిన్‌గా నటించింది. ఎస్. పి. దుర్గా నరేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాకేష్ రెడ్డి గ‌డ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తెలియచేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో హీరో హీరోయిన్లు నవ వధూవరులుగా కనిపించారు. కె.ఎం. రాధాకృష్ణ, సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అజయ్‌ ఘోష్, ప్రసాద్‌ బెహరా కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే... తిరువీర్ హీరోగా నటించిన మరో సినిమా 'భగవంతుడు' (Bhagawanthudu) టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ఇందులో కీలక పాత్రను పోషించారు. రవి పనస నిర్మించిన ఈ సినిమాతో జి. జి. విహారి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ కూడా సమ్మర్ స్పెషల్‌గా రాబోతోంది. అయితే ఇంకా దీని విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు.


ఇదే సమయంలో తిరువీర్‌ ఓ పాన్ ఇండియా మూవీ కూడా చేస్తున్నాడు. అదే 'ఓ సుకుమారి'! ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను భరత్‌ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇక కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న 'గువ్వల చెరువు ఘాట్‌' వెబ్ సీరిస్‌లోనూ తిరువీర్‌ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇలా ప్రాజెక్ట్స్ ఎంపిక చేసుకోవడంతో వేగం పెంచిన తిరువీర్ సమ్మర్‌కు వస్తున్న రెండు సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Mar 20 , 2026 | 05:58 PM