Tollywood: మాదాల రంగారావు మనవడు హీరోగా సినిమా
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:04 PM
మాదాల కుటుంబం నుండి మూడో తరం హీరో వస్తున్నాడు. మాదాల రంగారావు మనవడు, మాదాల రవి కొడుకు సన్నీ 'ఓ టార్చర్ ప్రేమ' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు.
తెలుగు సినీ యవనికపై విప్లవ కేతనం ఎగరేసిన వ్యక్తి రెడ్ స్టార్ మాదాల రంగారావు (Madala Rangarao). వెండితెరపై విప్లవశంఖం పూరించి, యువతరం ధియేటర్ల వైపు కదిలేలా చేశారాయన. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తన సత్తాను చాటారు. విప్లవశంఖం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, మహాప్రస్థానం, విప్లవ శంఖం, నవోదయం, ప్రజాశక్తి' వంటి ఎన్నో విప్లవాత్మక చిత్రాలలో ఆయన నాయకుడిగా నటించారు. విశేషం ఏమంటే వైద్యవృత్తిని చదివినా ఆయన కుమారుడు మాదాల రవి (Madala Ravi) సైతం తండ్రి బాటలో నటుడిగా మారారు. 'నేను సైతం, మా ఇలవేల్పు, బ్రోకర్ 2, పంచముఖి' వంటి చిత్రాలలో నటించారు. కొన్ని సినిమాలను నిర్మించారు.
ఇప్పుడు మాదాల కుటుంబం నుండి మూడో తరం హీరో వెండితెరపైకి వస్తున్నాడు. విదేశాలలో ఎం.బి.ఎ. విద్యను అభ్యసించిన మాదాల రవి తనయుడు సన్నీ (Sunny Madala) హీరోగా పరిచయం అవుతున్నాడు. 'ఓ టార్చర్ ప్రేమ' అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీకర్ కృష్ణ (Srikar Krishna) స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో మౌనిక డాకోజు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, దర్శకుడు పరచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'మా మాదాల రంగారావు గారి మనవడు, మాదాల రవి కుమారుడు మూడోతరం హీరో సన్నీ మాదాల హీరో గా పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం హీరో సన్నీ మాదాల ప్రేమ మార్గం ని ఎన్నుకున్నాడు. 'ఓ టార్చర్ ప్రేమ' అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు. రచన దర్శకత్వం అనేది మేం చాలా చిత్రాలకి వహించాం, కానీ దర్శకుడు శ్రీకర్ కృష్ణ మన దాసరి నారాయణ రావు గారి రీతిలో రచన, దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా అందించాడు. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ 'ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రం నవ్వులు చిందించే సన్నివేశాలతో సాగుతుంది. అంతేకాదు... ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం' అని తెలిపారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను రాజీవ్ కనకాల, వడ్లమాని సాయి శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియ, యాదమ్మ రాజు తదితరులు పోషించారు. ఇషాక్ వలి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.