సినిమా రివ్యూ: తిమ్మరాజు పల్లి టీవీ
ABN , Publish Date - Apr 17 , 2026 | 02:07 PM
‘తిమ్మరాజుపల్లి టీవీ’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. నూతన నటీనటులు సాయితేజ్, వేదా జలంధర్ జంటగా నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
సినిమా రివ్యూ: తిమ్మరాజు పల్లి టీవీ (Thimmarajupalli TV Review)
విడుదల తేది: 17-4-2026
‘తిమ్మరాజుపల్లి టీవీ’… టైటిల్ ప్రకటించినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయిన మూవీ. పూర్తిగా నూతన నటీనటులతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయం చేస్తూ కిరణ్ అబ్బవరం నిర్మించిన సినిమా ఇది. సుమైర స్టూడియోస్తో కలిసి, కేఏ ప్రొడక్షన్స్ పై రూపొందిన ఈ చిత్రం చిన్న సినిమాల్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని ఆరంభం నుంచి ఎంతో నమ్మకంగా చెబుతూ వస్తున్నారు కిరణ్ అబ్బవరం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ: (Thimmarajupalli TV Review)
రాయలసీమలోని కుప్పం దగ్గర తిమ్మరాజుపల్లి అనే చిన్న గ్రామం. అక్కడ శివరాత్రి పండుగను ప్రత్యేకంగా జరుపుకొంటారు. అప్పట్లో ఆ ఊరిలో ఏడో తరగతి వరకూ చదివిన ఏకైక వ్యక్తి సతీష్(సాయి తేజ్). చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండే సతీష్ ఆ ఊరిలో రాజప్ప (పదీప్ కొట్టే) చెల్లెలు శారద (వేద జలంధర్)తో ప్రేమలో పడతాడు. పండగల సమయంలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి, పక్క ఊరు నుంచి టీవీ, వీసీఆర్ అద్దెకు తెచ్చి సినిమాలు వేసి ఊళ్లో జనాలకు వినోదాన్ని పంచుతుంటాడు. ఆ గ్రామ పెద్ద రామచంద్రయ్య(అమ్మ రమేష్) ఊరిలో తొలి టీవీ తన ఇంట్లోనే ఉండాలని కలలు కంటుంటాడు. అయితే ఆయనకంటే ముందు రాజప్ప టీవీ కొని తెస్తాడు. దాంతో ఊరు వారంతా ప్రతి రోజు రాజప్ప ఇంటి దగ్గరే తిష్ట వేసేవారు. అవమానంతో రగిలిపోయిన రామచంద్రయ్య ఏదొకటి చేయాలనుకుంటాడు. ఇంతలో రాజప్ప ఇంట్లో టీవీ దొంగతనం జరుగుతుంది. అది సతీష్ పనే అని ఊరంతా నిర్దారిస్తుంది. టీవీ దొంగతనం చేసిందెవరు? ఆ నింద నుంచి సతీష్ ఎలా బయటపడ్డాడు? చివరికి ప్రియురాలు శారదను సొంతం చేసుకున్నాడా? లేదా? అన్నదే కథ.

విశ్లేషణ:
కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ తో తిమ్మరాజుపల్లిని పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. 1990లో పల్లెల్లో టీవీలు చాలా తక్కువ మంది ఇళ్ళలో ఉండేవి. చుట్టు పక్కల వారందరూ వచ్చి అక్కడే టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలు వీక్షిస్తుండేవారు. నిజానికి అప్పట్లో టీవీ అనేది ఓ ఎమోషన్. దాని చుట్టూ సింపుల్ గా కథ అల్లుకుని, చిన్న ప్రేమకథను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సతీశ్, శారద ప్రేమకథ, ఊళ్లో శివరాత్రి పండుగ, అన్నదానం, గ్రామ పెద్ద కన్నా ముందు రాజప్ప టీవీ కొని తీసుకురావడం, ఆపై టీవీ దొంగతనంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. టీవీ పోవడం, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ కథ బయటపడడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. టీవీని ఎవరు దొంగిలించారో కనుక్కుని, తాను దొంగ కాదు అని నిరూపించుకోవడానికి సతీశ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? అన్న విషయంతో ద్వితీయార్ధం ఆసక్తికరంగా సాగుతుంది. దొంగను కనిపెట్టే క్రమంలో నలుగురైదుగురు పై అనుమానం రేకెత్తించినా అసలు దొంగ ఎవరనే సస్పెన్స్ ను దర్శకుడు చివరి వరకూ మైంటైన్ చేశాడు. మధ్యమధ్యతో లవ్, సెంటిమెంట్ సీన్స్ కాస్త సాగదీతగా అనిపించినా... క్లైమాక్స్లో ఎల్లమ్మ పాత్ర ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. పక్కా కమర్షియల్ ఫార్మెట్ సినిమాలు నడుస్తున్న తరుణంలో ఇలా అందరూ కొత్తవారితో ఓ సింపుల్ అండ్ సింగిల్ లైన్ కథతో ప్రేక్షకుడిని రెండున్నర గంటలు కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరు…
ఈ సినిమాలో హీరోహీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ అందరూ కొత్తవారే. మెయిన్ లీడ్ అయిన సాయితేజ్ సతీశ్ పాత్రలో ఒదిగిపోయారు. హీరోయిన్ వేదా జలంధర్ కూడా సంప్రదాయబద్దంగా కనిపించి, చక్కని ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. రాజప్ప పాత్ర పోషించిన ప్రదీప్ కొట్టెది మరో కీలక పాత్ర. ఆయన కూడా పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. కొన్ని చోట్ల సముతిరఖనిని తలపింపచేశాడు. ఆయనకు భార్యగా నటించిన స్వాతి కరిమిరెడ్డి అమాయకమైన నటన సినిమాకు ఎస్సెట్. అమ్మ రమేష్, సత్యనారాయణ, ఇలా ఒకరేంటి మిగిలిన నటీనటులంతా తమ తమ పరిధి మేరకు చక్కగా నటించారు. ఇక తిమ్మరాజుపల్లి అందాలను అద్భుతంగా చూపించారు డిఓపీ అక్షయ్ రామ్ పొదిరెడ్డి. 1990ల నేపథ్యంలో పల్లె అందాల్ని చక్కగా చూపించారు. ఎక్కువ శాతం ఒరిజినల్ లొకేషన్లలో చిత్రీకరించడం కథకు కలిసొచ్చిందనే చెప్పాలి. వంశీకాంత్ రేఖన బాణీలు ఆకట్టుకునేల ఉన్నాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. దర్శకుడే ఎడిటర్ కావడం ప్లస్ అయినా.. సెకండాఫ్ లో కొన్ని చోట్ల సాగదీతగా అనిపించింది. నిర్మాత కిరణ్ అబ్బవరం కథకు తగ్గ బడ్జెట్ లో గ్రాండ్ గా తీశారు. లాజిక్కులు, భారీ అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు రావచ్చు. చిన్న చిత్రాల్లో బెంచ్ మార్క్ మాట సంగతి పక్కన పెడితే ఇలా అంతా కొత్తవారితో సినిమా తీసిన కిరణ్ అబ్బవరంను అభినందించక తప్పదు. అయితే ఈ తరహా సినిమాలకు ఓపెనింగ్స్ బాగా వచ్చినపుడే జనాల్లోకి ఫాస్ట్ గా వెళ్ళగలుగుతుంది. లేదంటే సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి శ్రమ పడక తప్పదు.
ట్యాగ్ లైన్: కొత్తవారితో ప్రయత్నం… అభినందనీయం
రేటింగ్: 2.75/5