Nandamuri Balakrishna: అఖండ 2 ప్లాప్.. ప్లాన్ మార్చిన గోపీచంద్
ABN , Publish Date - Jan 03 , 2026 | 05:15 PM
వరుస విజయాలతో సాగుతున్న నటసింహ బాలకృష్ణకు 'అఖండ-2 (Akhanda 2)' బ్రేక్ వేసింది. సరిగా 40 ఏళ్ళ క్రితం 1986లో బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుసగా ఆరు హిట్స్ సొంతం చేసుకున్నారు.
Nandamuri Balakrishna: వరుస విజయాలతో సాగుతున్న నటసింహ బాలకృష్ణకు 'అఖండ-2 (Akhanda 2)' బ్రేక్ వేసింది. సరిగా 40 ఏళ్ళ క్రితం 1986లో బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుసగా ఆరు హిట్స్ సొంతం చేసుకున్నారు. ఆ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. అప్పట్లో లాగా ఒకే యేడాది వరుసగా ఆరు హిట్స్ కాకపోయినా, మొత్తానికి కంటిన్యూగా సక్సెస్ చూస్తూ వచ్చారు బాలకృష్ణ.. 2021లో 'అఖండ'తో మరోమారు బాలయ్య జైత్రయాత్ర మొదలయింది. ఆ తరువాత వచ్చిన 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహరాజ్' చిత్రాలు కూడా సక్సెస్ రూటులో సాగాయి. ఈ చిత్రాలన్నీ వంద కోట్లు సాధించడం విశేషం. కాగా, ఐదో చిత్రంగా వచ్చిన 'అఖండ-2-తాండవం' ఆరంభం నుంచీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఆ మూవీ విడుదలలో జాప్యం కారణంగా బాక్సాఫీస్ వద్ద మునుపటి సత్తా చాటలేకపోయింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా వంద కోట్లు పోగేసింది. అయితే హిట్ గా నిలవలేకపోయింది.దీంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇక ఈ సినిమా తరువాత బాలయ్య నటించే చిత్రంలోని కథ కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉండేలా తయారు చేసుకున్నారు. అయితే 'అఖండ-2' పరాజయంతో కాసింత ఆలోచించి అడుగేయాలని బాలయ్య భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాలయ్యతో గోపీచంద్ మలినేని తెరకెక్కించే సినిమా సబ్జెక్ట్ ను మార్చేశారని విశేషంగా వినిపిస్తోంది.బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబోలో వస్తోన్న మూవీ కథను మార్చడానికి కారణం ఏంటి? ... ముందుగా చెప్పినట్టు ఈ సినిమాలో బాలయ్య మహారాజు గెటప్ లో కనిపిస్తారా లేదా అన్నది సందేహంగా మారింది... ఆ గెటప్ సంగతేంటో కానీ, మొత్తానికి ముందు అనుకున్న సబ్జెక్ట్ మారిపోయిందట. ఆ సినిమా సాంఘిక చిత్రమే అయినా, అందులో కథానుగుణంగా కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉంటుందని అన్నారు.
హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉన్నట్టయితే తప్పకుండా వీఎఫ్ఎక్స్ వర్క్ అవసరం ఉంటుంది... దాంతో మేకింగ్ లో జాప్యం జరగవచ్చు. ఒకవేళ ఆ సినిమా జనం ముందుకు వచ్చినా, అందులోని వైవిధ్యమైన కథ, కథనం ఆకట్టుకోవచ్చు లేకుంటే లేదు.. అందువల్లే 'వీరసింహారెడ్డి' లాగే ఓ మాస్ మసాలా మూవీతోనే ముందుగా రావాలని బాలయ్య, గోపీచంద్ మలినేని భావించినట్టు సమాచారం. 'అఖండ-2' విడుదలలో ఎదురైన పరిణామాలు ఈ మూవీ చవిచూడరాదనే సంకల్పంతో పక్కా ప్లానింగ్ వేసుకుంటున్నారట మేకర్స్. ఆశలు రేపుతూ వచ్చిన 'అఖండ-2' పరాజయంతో బాలయ్య సైతం ఆచితూచి అడుగు వేయాలనే నిర్ణయించారని తెలుస్తోంది... ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మలినేని కథ మార్చారని వినికిడి... బాలయ్యకు వరుస విజయాలు ఇవ్వాలని గోపీచంద్ మలినేని సైతం ఆశిస్తున్నారు. అందువల్ల అందరూ మెచ్చే కథతో సాగితేనే బాగుంటుందని సబ్జెక్ట్ ఛేంజ్ చేసినట్టు తెలుస్తోంది... మరి ఈ సారి బాలయ్యకు గోపీచంద్ ఏ స్థాయి విజయాన్ని అందిస్తారో చూడాలి.