Thellakagitam: తెల్ల కాగితం.. ఆన్‌లైన్‌లో లీక్‌

ABN , Publish Date - Sep 29 , 2026 | 01:39 PM

అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతున్న యూత్‌ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ ‘తెల్లకాగితం’కు విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింది.

అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతున్న యూత్‌ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ ‘తెల్లకాగితం’కు విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింది. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో చిత్ర బృందం అప్రమత్తమైంది. అనుమతి లేకుండా కంటెంట్‌ను లీక్ చేసి ప్రచారం చేస్తున్నారంటూ నిర్మాణ సంస్థ తీవ్రంగా స్పందించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. విడుదలకు కొద్ది రోజులే సమయం ఉండటంతో సినిమాకు సంబంధించిన కీలక కంటెంట్ బయటకు రావడం మేకర్స్‌కు ఇబ్బందికరంగా మారింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ‘తెల్లకాగితం’కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కనిపించినట్లు తెలిసింది.

ఈ కంటెంట్ ఎలా బయటకు వచ్చిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ.. ఓవర్సీస్ ఫుటేజ్ నుంచి లీక్ అయి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ సన్నివేశాలను వివిధ సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించే చర్యలను చిత్ర బృందం చేపట్టినట్లు తెలుస్తోంది.  దీనిపై అరుణాచల క్రియేషన్స్ స్పందించింది.  ''మా  తెల్లకాగితం’ సినిమా కంటెంట్ అనుమతి లేకుండా ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. క్రియేటర్‌ స్టూడియో సినిమాకు సంబంధించిన కంటెంట్‌ చట్టవిరుద్ధంగా లీక్ చేయడాన్ని, షేర్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. లీకైన కంటెంట్‌ను డౌన్‌లోడ్‌, షేర్, తిరిగి పోస్ట్ చేయవద్దని లేదా ఎలాంటి రూపంలోనూ ప్రచారం చేయొద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. ‘తెల్లకాగితం’ చిత్రాన్ని కేవలం థియేటర్లలోనే వీక్షించి, మా చిత్ర బృందానికి మీ మద్దతును అందించాలని ప్రేక్షకులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము’’ అని పేర్కొన్నారు. 

Updated Date - Sep 29 , 2026 | 03:08 PM