బెత్లెహేమ్ కుటుంబ యూనిట్.. ఏం సినిమారా బాబు.. పోవడం లేదు మైండ్ లో నుంచి
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:50 PM
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సరికొత్త రొమాంటిక్ కామెడీ డ్రామా 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit) బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన విషయం తెల్సిందే.
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సరికొత్త రొమాంటిక్ కామెడీ డ్రామా 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit) బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన విషయం తెల్సిందే. గిరీష్ ఎ.డి. దర్శకత్వంలో వర్సటైల్ హీరో నివిన్ పౌలీ, ప్రేమలు ఫేమ్ మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 21న ఓణం కానుకగా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఎటువంటి ముందస్తు హడావుడి లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ325 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, ఆల్-టైమ్ మలయాళ అత్యధిక కలెక్షన్ల రికార్డుల్లో ఒకటిగా నిలిచింది.
ఇక తెలుగువారు రోమ్ కామ్ సినిమా అంటే అస్సలు వదలరు. అందులో ప్రేమలు డైరెక్టర్ సినిమా అంటే మరీ వదలరు. అందుకే సోషల్ మీడియా మొత్తాన్ని బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ సీన్స్ తో నింపేస్తున్నారు. థియేటర్లలో ఏకధాటిగా వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రం అక్టోబర్ 2 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఈ చిత్రానికి డిజిటల్ వేదికపై ఊహించని రీతిలో భారీ ఆదరణ లభిస్తోంది.
నేచురల్ డైలాగ్స్, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే నేబర్ హుడ్ డ్రామా, వయస్సు వ్యత్యాసంతో సాగే క్యూట్ లవ్ స్టోరీ, విష్ణు విజయ్ అందించిన సోల్‌ఫుల్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా కట్టిపడేయడంతో అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మమితా నటనకు నీరాజనాలు పడుతున్నారు. యాష్లే పాత్రలో ఆమె నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలోని మాతా.. పితా .. మమితా డైలాగ్ ని ట్రెండ్ చేస్తూ ఆమె వీడియోలను ఎడిట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే.. ఏం సినిమారా బాబు.. పోవడం లేదు మైండ్ లో నుంచి అని చెప్పుకొస్తున్నారు.
కథ విషయానికొస్తే.. జస్టిన్ ఒక పెళ్లి కానీ వ్యక్తి. వయస్సు పెరిగినా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. అతడి పక్కింట్లోకి యాష్లే వస్తోంది. జస్టిన్ కన్నా చాలా చిన్న అమ్మాయి అయినా.. అతని క్యారెక్టర్ నచ్చి ప్రేమలో పడుతుంది. జస్టిన్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. అయితే యాష్లే పేరెంట్స్ వీరి ప్రేమను ఒప్పుకోరు. ఆ తరువాత వీరిద్దరి ప్రేమ కథ ఏమైంది.. ? చివరికి జస్టిన్- యాష్లే కలిశారా.. ? లేదా.. ? అనేది కథ. మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా బెత్లెహేమ్ కుటుంబ యూనిట్. ఇప్పటివరకు కనుక ఈ సినిమా చూడకపోతే కుటుంబంతో సహా చూసేయండి.