Theatre Allocation : విజయ్‌కు ఒక రూల్..ప్రభాస్‌కు ఇంకో రూలా..

ABN , Publish Date - Jan 04 , 2026 | 10:27 AM

ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మామూలుగా లేదు. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రాజా సాబ్'గా వస్తుంటే, కోలీవుడ్ దళపతి విజయ్ తన ఆఖరి చిత్రం 'జననాయగన్‌'తో  బరిలోకి దిగుతున్నారు.

ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మామూలుగా లేదు. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) 'రాజా సాబ్'గా 9the Rajasaab) వస్తుంటే, కోలీవుడ్ దళపతి విజయ్ తన ఆఖరి చిత్రం 'జననాయగన్‌'తో  (Jananayagan) బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు భారీ చిత్రాలు జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియా వేదికల్లో ఒకటే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది.. మన వాళ్లకు ఒక న్యాయం.. పక్క రాష్ట్రం వాళ్లకు మరో న్యాయమా..?

రాజాసాబ్ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ప్రభాస్ రేంజ్‌కు థియేటర్లు దొరకడం పెద్ద సమస్య కాదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన తెలుగు డిస్ట్రిబ్యూటర్లు విజయ్ నటించిన జననాయగన్ సినిమాకు కూడా రాజాసాబ్‌తో సమానంగా స్క్రీన్లను కేటాయించడం. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో ఆయనకు గౌరవం ఇవ్వడం మంచిదే. అయినా మన సొంత హీరో సినిమాకు ఉండాల్సిన ప్రాధాన్యతను తగ్గించి మరీ పరభాషా చిత్రానికి ఇన్ని థియేటర్లు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మన వాళ్లు అంత ఉదారంగా వ్యవహరిస్తుంటే, తమిళనాడులో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ప్రభాస్ సినిమాకు థియేటర్ల కేటాయింపులో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విజయ్ సినిమాతో నేరుగా తలపడటం ఎందుకు అని భావించి, రాజాసాబ్ టీమ్ ఒక రోజు ఆలస్యంగా అక్కడ విడుదల చేయడానికి సిద్ధమైంది. అయినా సరే, అక్కడ ప్రభాస్ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కడం లేదనే వార్తలు అభిమానులను కలిచివేస్తోంది. మన సినిమాలను అక్కడ తొక్కేయాలని చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. విజయ్ జననాయగన్ సినిమా మన బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం భగవంత్ కేసరి కి అధికారిక రీమేక్. తెలుగు ప్రేక్షకులు అద్భుతమైన కథను, ఎమోషన్లను ఇప్పటికే ఎంజాయ్ చేశారు. ఇప్పటికే చూసేసిన కథతో వస్తున్న రీమేక్ సినిమా కోసం, మన అసలైన పాన్ ఇండియా సినిమా రాజాసాబ్ థియేటర్లను కోల్పోవాల్సి రావడం ఎంతవరకు కరెక్ట్‌..

టాలీవుడ్ ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తుంది. అది ఏ భాషా చిత్రం అయినా సరే, ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. కానీ కోలీవుడ్ మేకర్స్ మాత్రం మన సినిమాల విషయంలో అడుగడుగునా నిబంధనలు పెడుతూ, థియేటర్ల దగ్గర వివక్ష చూపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మన మేకర్స్ పక్క రాష్ట్రం వాళ్లకు ఇస్తున్న విలువలో కనీసం సగం కూడా అక్కడ మన హీరోలకు దక్కకపోవడం దారుణమైన విషయమే. మరి ఈ సంక్రాంతి పోరులో ప్రభాస్ తన సత్తా చాటుతారా..? లేక థియేటర్ల రాజకీయాల వల్ల రాజాసాబ్ కలెక్షన్లపై ప్రభావం పడుతుందా..? అనేది వేచి చూడాలి.

Updated Date - Jan 04 , 2026 | 10:32 AM