ఆకట్టుకుంటున్న ‘ది సెస్సో’ ట్రైలర్.. టీమ్‌పై ఆకాష్ జగన్నాథ్ ప్రశంసలు!

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:29 AM

‘అందమైన సినీ జీవితం వెనుక ఎన్నో కష్టాలుంటాయి. వాటిని దాటుకుని ముందడుగువేశాం. భావోద్వేగాలతో ముడిపడిన కథతో ‘ది సెస్సో’ను తెరకెక్కించాం’ అని దర్శకుడు యశ్‌రాజ్‌ అన్నారు.

The Sesso

గ్రేస్ గ్రిట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై బి.ఎన్. రవి నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘ది సెస్సో’ (The Sesso). యశ్ రాజ్ (Yash Raj) దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలోనూ నటిస్తున్న ఈ సినిమాలో మౌపియ గౌస్వామి, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో చిలుముల మదన్ రెడ్డి, గండిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ యాదవ్, ప్రభు రావులకోలు, నర్సింగ్, శ్రావణ్ రావులకోలు తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ఈ సందర్భంగా ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘ది సెస్సో’ ట్రైలర్ చాలా బాగుందని, ఇందులో హీరో, హీరోయిన్ చక్కగా నటించారని ప్రశంసించారు. చిత్ర బృందం మరిన్ని మంచి సినిమాలు చేయాలని, ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. తనను ఈ సినిమా టీమ్ సంప్రదించిందని, ట్రైలర్ చూసిన తర్వాత చాలా నచ్చిందని తెలిపారు.

దర్శకుడు యశ్ రాజ్ మాట్లాడుతూ.. తమ చిత్రానికి మద్దతుగా నిలిచేందుకు వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమ ప్రయాణంలో తొలి అడుగు మాత్రమేనని పేర్కొన్నారు. సినిమా జీవితం బయటకు ఎంతో రంగులమయంగా కనిపించినా.. దాని వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు ఉంటాయని చెప్పారు. సమాజం గురించి తనకు కలిగిన ఆలోచనలే ఈ కథకు బీజమయ్యాయని, సాధారణ మానవ భావోద్వేగాల ఆధారంగా ‘ది సెస్సో’ రూపొందించామని వివరించారు.

ఓవర్‌నైట్ స్టార్ కావాలనే ఆలోచనతో తాను చిత్ర పరిశ్రమలోకి రాలేదని, ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని యశ్ రాజ్ అన్నారు. నిజాయతీతో పనిచేస్తేనే పరిశ్రమలో నిలదొక్కుకోగలమని అభిప్రాయపడ్డారు. నిర్మాత బి.ఎన్. రవి అందించిన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. తన ఆహ్వానం మేరకు కార్యక్రమానికి వచ్చిన ఆకాష్ జగన్నాథ్, అశోక్ యాదవ్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హీరోయిన్ మౌపియ గౌస్వామి అందంగా ఉండటమే కాకుండా అద్భుతంగా నటించారని ప్రశంసించారు.

అశోక్ యాదవ్ మాట్లాడుతూ.. ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం వెనుక వందల రోజుల శ్రమ ఉంటుందని పేర్కొన్నారు. మూడు గంటల సినిమా కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడుతుందని, ఆ కష్టం తనకు తెలుసని అన్నారు. ‘ది సెస్సో’ టీమ్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్‌లను కూడా తీసుకొస్తానని తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ ఆకట్టుకుందని, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. దర్శక నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు. నిర్మాత బి.ఎన్. రవి మాట్లాడుతూ.. మూడు గంటల సినిమా రూపొందించడం వెనుక దాదాపు 300 రోజుల కష్టం ఉంటుందని తెలిపారు. తమ టీమ్ ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని పూర్తి చేసిందని, ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. హీరోయిన్ మౌపియ గౌస్వామి మాట్లాడుతూ.. తనకు ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులందరూ ‘ది సెస్సో’ సినిమాను తప్పకుండా చూడాలని కోరారు. త్వరలో తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది.

Updated Date - Nov 17 , 2026 | 10:29 AM