Ormax 2025: రాజు ఎక్కడున్నా రాజేరా.. మరోసారి ఫస్ట్ ప్లేస్ లో ప్రభాస్

ABN , Publish Date - Jan 20 , 2026 | 06:56 PM

ప్రతి యేటా చివరలో ఆ యేడాది టాప్ స్టార్స్ ఎవరు అంటూ కొన్ని సర్వేలు సాగుతూ ఉంటాయి... 2025 డిసెంబర్ లో ఆర్మాక్స్ (Ormax) సంస్థ నివేదికలో పది మంది టాప్ హీరోస్, ఓ పది మంది టాప్ హీరోయిన్స్ తేలారు.

Ormax 2025

Ormax 2025: ప్రతి యేటా చివరలో ఆ యేడాది టాప్ స్టార్స్ ఎవరు అంటూ కొన్ని సర్వేలు సాగుతూ ఉంటాయి... 2025 డిసెంబర్ లో ఆర్మాక్స్ (Ormax) సంస్థ నివేదికలో పది మంది టాప్ హీరోస్, ఓ పది మంది టాప్ హీరోయిన్స్ తేలారు. స్టార్ హీరోస్ పదిమందిలో ఐదుగురు తెలుగువారే కావడం విశేషం. ఆ మధ్య ప్రభాస్ (Prabhas) 'స్పిరిట్' టీజర్ రిలీజ్ చేస్తూ అందులో 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' ప్రభాస్ అని పేర్కొన్నారు. దానిని చూసి ఉత్తరాదిన కొందరు స్టార్ హీరోస్ ఫ్యాన్స్ ఉడికి పోయారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ (shah Rukh Khan) అభిమానులు అసలైన 'సూపర్ స్టార్' షారుఖ్ ఒక్కడే అంటూ హడావుడి చేశారు.

మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఆర్మాక్స్' 2025 డిసెంబర్ లో టాప్ స్టార్స్ ఎవరూ అంటూ సర్వే నిర్వహించింది. ఆ సంస్థకు అందిన సమాచారం ప్రకారం ఇండియాలోనే ప్రభాస్ నంబర్ వన్ గా నిలిచారు... పోనీ తరువాతి స్థానంలో షారుఖ్ ఉన్నాడా అంటే ఆయన మూడో ప్లేస్ లో ఉన్నారు... రెండో స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ వెలిగారు... 4,5 స్థానాల్లో వరుసగా అల్లు అర్జున్, మహేశ్ బాబు నిలవగా, ఆరో ప్లేస్ లో తమిళ స్టార్ అజిత్ ఉన్నారు... 7,8 స్థానాలను రామ్ చరణ్, జూనియర్ యన్టీఆర్ కైవసం చేసుకున్నారు... తొమ్మిదిలో సల్మాన్, పదో స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నారు. అలా ఆర్మాక్స్ టాప్ స్టార్స్ జాబితాలో ఐదుగురు తెలుగు స్టార్స్ చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది.

ఆర్మాక్స్ సంస్థ టాప్ హీరోయిన్స్ ఆఫ్ 2026 జాబితాలో సమంత ప్రథమ స్థానం ఆక్రమించడం విశేషం. సమంతకు ఈ మధ్య అదిరిపోయే హిట్స్ ఏమీ లేకపోయినా, సోషల్ మీడియాలో ఆమె చేసినంత హల్ చల్ మరో నాయిక చేయలేదనే చెప్పాలి. సమంత - రాజ్ నిడిమోరు పెళ్ళిని జనం ఓ పెద్ద విశేషంగా భావించారు. అలా ఆమెకు అగ్రస్థానం లభించింది. అలియా భట్, రశ్మిక, దీపికా పదుకోణె, నయనతార - వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచారు. కాజల్ అగర్వాల్ ఆరో స్థానం దక్కించుకోగా, 7.8 స్థానాల్లో త్రిష, సాయిపల్లవి ఉన్నారు. అనుష్క 9వ స్థానంతో సరిపుచ్చుకోగా, శ్రీలీల పదో స్థానంలో నిలచింది.కాజల్, అలియా భట్ మినహా టాప్ హీరోయిన్స్ జాబితాలోని అందరూ దక్షిణాది భామలు కావడం విశేషం.

ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసిన జాబితాలోని టాప్ స్టార్స్ మాత్రమే గొప్ప - ఇతరులు కాదు అనుకొంటే పొరబాటు. ఆ సంస్థ సేకరించిన ఆధారాల ప్రకారం టాప్ హీరోస్, టాప్ హీరోయిన్స్ అంటూ పదేసి మంది తేలారు... అందుకోసం సంస్థ పాటించిన నియమనిబంధనలు కూడా పరిగణించాల్సి ఉంటుంది. నిజానికి 2025లో 'కన్నప్ప' చిత్రంలో రుద్ర పాత్రలో కాసేపు కనిపించారు ప్రభాస్. అయితే ఆయన 'బాహుబలి' సిరీస్ 'బాహుబలి- ది ఎపిక్'గా గత యేడాది జనం ముందు నిలచింది. దాంతో మళ్ళీ జనం మదిలో ప్రభాస్ కే అగ్రపీఠం దక్కిందని పరిశీలకులు అంటున్నారు.తన పెళ్ళికారణంగా సమంత నాయికల్లో నంబర్ వన్ గా నిలిచారు. ఇలా 2025లో సినిమాల్లో నటించక పోయినా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన వారినే 'ఆర్మాక్స్' తన టాప్ టెన్ లో నిలిపినట్టుగా భావించవచ్చు. మరి ఈ 2026లో 'ఆర్మాక్స్' ఎవరిని టాప్ టెన్ స్టార్స్ గా పేర్కొంటుందో చూడాలి.

Updated Date - Jan 20 , 2026 | 06:56 PM