Pawan Kalyan: అరుదైన గౌరవాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:23 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు ఎవరు ఇలాంటి గౌరవాన్ని అందుకోలేదు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు ఎవరు ఇలాంటి గౌరవాన్ని అందుకోలేదు..సాంప్రదాయ జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో కన్రికై ఆయనకు ప్రతిష్టాత్మకమైన ఐదవ డాన్‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుతో సత్కరించింది. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తన హ్యాండిల్ లో అధికారికంగా పోస్ట్ చేసింది.
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ అనే పేరుతో ఒక వీడియోను షేర్ చేస్తూ.. పవన్ అసలు మార్షల్ ఆర్ట్స్ ఎలా మొదలుపెట్టారు .. ఎక్కడెక్కడ నేర్చుకున్నారు.. ఎలా ఎదిగారు లాంటివన్నీ ఆ వీడియోలో పొందుపరిచారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వీడియోకు వాయిస్ అందించినట్లు తెలుస్తోంది. మార్షల్ ఆర్ట్స్ ని జనాల మధ్యకు తీసుకువెళ్లడంలో ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి గుర్తింపుగా డిసెంబర్ 30, 2025 న ఆయన ఒక అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు.
భారత దేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రొఫెసర్ డా. సిద్దిఖీ మహ్మద్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును అందుకున్నారు. ఇలాంటి ఒక బిరుదును అందుకున్న మొట్ట మొదటి ఇండియన్ పవన్ కళ్యాణ్ మాత్రమే. సోగో బుడో కన్రికై సంస్థ ద్వారా ఐదవ డాన్ గౌరవాన్ని సోకే మరమత్సు సెన్సై నేతృత్వంలో టకెడా షింగ్ క్లాన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ కి స్థానం కల్పించారు' . ఇక ఈ వార్త తెలియడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.