Thaman S: నా ఇంటి పేరు.. బరువు.. బాధ్యతలతో కూడినది..
ABN , Publish Date - Jun 08 , 2026 | 03:04 PM
ఎస్.ఎస్.థమన్. ఈ నెల 13 నుంచి ‘ఓజీ ఇండియా టూర్’ పేరుతో ఆయన ఇండియాలో నాలుగు చోట్ల లైవ్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు.
‘ఘంటసాల నా ఇంటి పేరు. అది బరువు.. బాధ్యతలతో కూడింది. అందుకే సింపుల్‌గా తమన్ అని పెట్టుకున్నాను. కానీ నాకు కొణిదెల, నందమూరి వంటి పేర్లు నా ఇంటి పేరుకు కలిపేస్తున్నారు అని అన్నారు ఎస్.ఎస్.థమన్. ఈ నెల 13 నుంచి ‘ఓజీ ఇండియా టూర్’ పేరుతో ఆయన ఇండియాలో నాలుగు చోట్ల లైవ్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన విశేషాలను సోమవారం వెల్లడించారు.
‘ఓజీ సినిమా మ్యూజిక్ నన్ను ఓ స్థాయికి తీసుకెళ్లింది. ఆ సినిమాల్లో పాటలు నాలో ఎనర్జీని పెంచాయి. ఎక్కడికెళ్లినా ఆ ట్రాక్‌లు మోగుతున్నాయి. అందుకే ఆ సక్సెస్‌ను అలా కొనసాగించాలని ఓజీ ఇండియా టూర్’ పేరుతో దేశంలో నాలుగు చోట్ల కాన్సెర్ట్ ప్లాన్ చేశాను. ఈనెల 13న హైదరాబాద్, జూలై 11 బెంగళూరు, ఆగస్ట్ 5న చెన్నై, సెప్టెంబర్ 25న వైజాగ్‌లో నిర్వహిస్తున్నాం. ఈ ఈవెంట్‌కు 44 పాటల లిస్ట్ ఉంది. అందులో ఉర్రూతలలూగించే డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ వల్ల నాకు ఎనలేని ఎనర్జీ వస్తుంది. పబ్లిక్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి దేనికి ఎక్కువ రియాక్షన్ వస్తుందనేది తెలుస్తుంది. నా రాబోయే సినిమాల కంటెంట్ కూడా ఈవెంట్‌లో ప్రత్యేకంగా రివీల్ చేయాలనుకుంటున్నా.
బాలయ్య.. మైండ్ బ్లోయింగ్ అనేలా
నందమూరి బాలకృష్ణ గారిని రాబోయే సినిమాలో నెవర్ బిఫోర్ అవతార్‌లో చూస్తారు. గోపీచంద్ మలినేని మైండ్ బ్లోయింగ్‌గా సినిమా తీస్తున్నాడు. రెండు రోజుల్లో టీజర్ రాబోతుంది. నేను వర్క్ చేస్తున్న మరో చిత్రం అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’. తను కూడా బాగా కష్డపడ్డాడు. అతనికి హిట్ రావాలి. చిరంజీవి- బాబీ సినిమా, ‘ఇట్లు అర్జున’, ‘ఆదర్శకుటుంబం’ ఇలా ప్రతి సినిమా వేటికవే ప్రత్యేకంగా చేస్తున్నా. ఓ మైథలాజికల్ మూవీకి వర్క్ చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్ గారిని ఎప్పుడు పోటీగా ఫీలవ్వము. 75 ఏళ్ల వయస్సులో ఇళయరాజా స్టూడియో కడుతున్నారు. తాజాగా పెద్దిలో రెహమాన్‌గారు ‘చికిరి చికిరి’ పాట చేయటం ఆహ్లాదకరంగా అనిపించింది. వారు ఎప్పుడు మాకు స్ఫూర్తివంతులే! నేను ఏ ఈవెంట్ చేసినా నా రెమ్యూనరేషన్ నుంచి ఓ ఛారిటీకి డొనేషన్ ఇస్తాను. అది నా పర్సనల్ ఖాతా నుంచి ఇస్తాను.
దేవికి హిట్ పక్కా..
దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న ఎల్లమ్మ కథ నాకు తెలుసు. గేమ్ ఛేంజర్ టైమ్‌లో దిల్ రాజు చెప్పారు. అది పక్కా సూపర్ హిట్ సినిమా. దేవి అన్న బాగా వర్క్ చేస్తున్నాడు. దేవుడు నాకు ఏసీ రూమ్‌లో కూర్చోని పని చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఎండల్లో ఒళ్లు హూనం చేసుకుని నటించడం ఎందుకు. అందుకే నేను హీరోగా మాత్రం చేయను.