Jani Master: తప్పులు జరిగాయి.. ద‌య‌చేసి క్ష‌మించండి

ABN , Publish Date - Aug 12 , 2026 | 09:57 AM

TFTDDA 2025–2027 నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది

jani master

తెలుగు ఫిలిం & టీవీ డ్యాన్సర్స్‌, డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA) నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో మంగ‌ళ‌వారం ఘనంగా జరిగింది. 2025–2027 సంవత్సరానికి సంబంధించి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో తమ బాధ్యతలను స్వీకరించి ప్రమాణం చేశారు. అసోసియేషన్‌ అధ్యక్షురాలు సుమలతా దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్‌ నాయకులు, డ్యాన్సర్లు, డ్యాన్స్‌ డైరెక్టర్లు, సినీ, టీవీ రంగానికి చెందిన పలువురు సభ్యులు హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు అధ్యక్షురాలు సుమలతా దేవితో పాటు యూనియన్‌ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. బైలా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని సుమలతా దేవి తెలిపారు. యూనియన్‌ సభ్యులంతా తమకు సహకరించాలని కోరారు.

అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జి. బాలకృష్ణ మాట్లాడుతూ.. చిరంజీవికి తాము వ్యతిరేకమంటూ గతంలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం తమ అసోసియేషన్‌కు ఆర్థికంగా సహాయం చేసిన చిరంజీవి, రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పారు. సభ్యుల సంక్షేమానికి తమ కార్యవర్గం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి సభ్యుడికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పించేందుకు కృషి చేస్తామని బాలకృష్ణ తెలిపార‌ని అన్నారు.


ఈ సందర్భంగా TFTDDA అభివృద్ధికి పునాది వేసిన వ్యవస్థాపకుల సేవలను సభ్యులు గుర్తుచేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కురాజు మాస్టర్‌, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సోమరాజు, వ్యవస్థాపక కోశాధికారి ఎల్‌. వెంకటేశ్వరరావు అందించిన సేవలు, మార్గదర్శకత్వాన్ని స్మరించుకున్నారు. అనంత‌రం..ప్రముఖ కొరియోగ్రాఫర్‌ షేక్‌ జానీ బాషా (Jani Master) మాట్లాడుతూ.. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో జరిగిన విషయాలను పక్కనపెట్టి కొత్తగా ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. తాను కొంతకాలం యూనియన్‌కు దూరంగా ఉన్నప్పటికీ తిరిగి వచ్చానని తెలిపారు. ఇకపై అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిర్మాతలు, ఫిలిం ఛాంబర్‌తో పాటు సినీ పరిశ్రమలోని అన్ని వర్గాలు డ్యాన్స్‌ కళాకారుల అసోసియేషన్‌ను కలుపుకుని ముందుకు వెళ్లాలని, ఇప్ప‌టివ‌ర‌కు కొన్ని తప్పులు జరిగాయని మమ్మల్ని క్షమించాలి కోరారు.

డ్యాన్సర్లకు నేరుగా అవకాశాలు: విశ్వ ప్రసాద్‌

పీపుల్స్‌ మీడియా అధినేత, నిర్మాత టీ.జి. విశ్వ ప్రసాద్‌ మాట్లాడుతూ.. దళారుల ద్వారా కాకుండా కళాకారులకు నేరుగా చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. తమ నిర్మాణ సంస్థ నుంచి తెలుగు డ్యాన్సర్లకు నేరుగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నటుడు తాగుబోతు రమేష్‌ కూడా నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. యూనియన్‌ సభ్యుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. డ్యాన్స్‌ కళాకారులు, డ్యాన్స్‌ డైరెక్టర్లు, టీవీ, సినీ రంగంలోని డ్యాన్సర్ల సంక్షేమం కోసం TFTDDA నిరంతరం కృషి చేస్తోందని ప్రతినిధులు తెలిపారు. సభ్యుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని నూతన కార్యవర్గం ప్రకటించింది.

కొత్త కార్యవర్గం: ప్రధాన కార్యదర్శి: జి. బాలకృష్ణ, కోశాధికారి: ఇశ్రాయేలు పిట్ట (వడివేల్‌), ఉపాధ్యక్షుడు: జి. శంకర్, జాయింట్‌ సెక్రటరీ: పి. నాగ మల్లేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ: జి. రవితేజ, కార్యవర్గ సభ్యులు: పి. కన్నయ్య, జి. వెంకన్న, ఎం. రమేష్‌, ఎం. రాములు, కె. నిరంజని, సిహెచ్‌. సాయిలక్ష్మి.

Updated Date - Aug 12 , 2026 | 09:57 AM