Producers vs Exhibitors: కామెడీలు చేయడానికి.. ప్రెస్‌మీట్స్ పెట్టకండి
ABN , Publish Date - May 14 , 2026 | 08:11 AM
తెలుగు సినీ నిర్మాతలకూ, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
తెలుగు సినీ నిర్మాతలకూ, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సింగిల్ స్ర్కీన్స్‌లో పర్సెంటేజీ విధానానికి అంగీకరించిన నిర్మాతల సినిమాలనే ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మంగళవారం ఓ ప్రెస్‌మీట్ పెట్టి నిర్ణయం తీసుకుంది. దీనికి స్పందనగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Producers Gild) బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలోని నిర్మాత మైత్రి రవిశంకర్ (Ravishankar ) మాట్లాడుతూ ‘ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలసి పనిచేస్తున్నాం. ఇటీవలే జరిగిన ఓ సమావేశంలో వారికి అన్యాయం జరుగుతోందని ఎగ్జిబిటర్లు అన్నారు. వారి ఇబ్బందులను అర్థం చేసుకుంటాం. అలాగే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బంది పడుతున్నారని చేసుకోవాలి. మూడు సెక్టర్లలోని వారంతా కలసికట్టుగా మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమా విడుదలవుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరికాదు’ అన్నారు.
‘ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు.. ఇప్పటికే యాభై శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న చిత్రాల విషయంలో ఎగ్జిబిటర్లు కోరిన షరతులన్నీ అంగీకరించలేం. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో ఈ విధానం అమలుచేయడానికి ఆలోచిస్తాం. థియేటర్ల గ్రేడింగ్, మెయింటెనెన్స్ ఛార్జ్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వంటి విషయాలపై చర్చించాలి.
సీ సెంటర్ నుంచి బీ, ఏ సెంటర్ వరకూ ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టీప్లెక్సులు కట్టేసి, సింగిల్ స్క్రీన్స్‌కు రెవెన్యూ రాకుండా చేస్తూ.. 300 మల్టీప్లెక్స్‌లు కలిగిఉన్న ఒక ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. దయచేసి ఇలాంటి కామెడీలు చేయడానికి ప్రెస్‌మీట్‌లు పెట్టకండి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మెరుగైన వసతులు కల్పిస్తే.. ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది’ అన్నారు నాగవంశీ. ఈ సమావేశంలో సాహు గారపాటి, వెంకట సతీశ్, సుధాకర్ చెరుకూరి కూడా పాల్గొన్నారు.