నిర్మాతల మండలి ఎన్నికల్లో.. ‘మన ప్యానల్’ క్లీన్ స్వీప్

ABN , Publish Date - Sep 06 , 2026 | 07:02 PM

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానల్’ ఆధిపత్యం సాధించింది.

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (Telugu Film Producers Council) 2026-28 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు నిర్వహించిన ఎన్నికలు ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగగా.. మొత్తం 1168 మంది సభ్యులకు గాను 643 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల త‌ర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ‘మన ప్యానల్’, ‘ప్రోగ్రెసివ్ ప్యానల్’ మధ్య గట్టి పోటీ నెలకొన‌గా కీలక పదవుల్లో ‘మన ప్యానల్’ ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి.కల్యాణ్ (C Kalyan) ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఎన్నికల్లో ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ఈసీ సభ్యుల పదవుల్లో పలువురు విజయం సాధించారు. ట్రెజరర్‌గా చదలవాడ శ్రీనివాసరావు విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ పదవికి ‘మన ప్యానల్’ నుంచి మోహన్ వడ్లపట్ల గెలుపొందగా.. ‘ప్రోగ్రెసివ్ ప్యానల్’ నుంచి దామోదర్ ప్రసాద్ విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీలుగా ‘మన ప్యానల్’ నుంచి అమ్మిరాజు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఎన్నికయ్యారు.

ఈసీ సభ్యుల విషయంలోనూ ‘మన ప్యానల్’ భారీ ఆధిక్యం సాధించింది. ఆ ప్యానల్ నుంచి 12 మంది సభ్యులు విజయం సాధించారు. పద్మిని, ఎషియన్ సునీల్, మోహన్ గౌడ్, శివలెంక కృష్ణప్రసాద్, దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, శ్రీనివాసరావు, పుల్లారావు, బాపిరాజు, ఆర్.కె. కౌడ్, నయీం ఈసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక ‘ప్రోగ్రెసివ్ ప్యానల్’ నుంచి మైత్రీ రవి, నిరంజన్ రెడ్డి, డీఎస్ రావు ఈసీ సభ్యులుగా గెలుపొందారు. అయితే జనరల్ సెక్రటరీ పదవికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉండటంతో ఆ పదవిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

నిర్మాతలకు అండగా ఉంటాం: సి.కల్యాణ్

ఎన్నికల అనంతరం నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ... తమ ప్యానల్‌పై నమ్మకం ఉంచి గెలిపించిన నిర్మాతలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి సైతం ఎంతోమంది నిర్మాతలు హైదరాబాద్‌కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. తమ ప్యానల్‌కు దాదాపు 95 శాతం మంది నిర్మాతల మద్దతు లభించడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని సి.కల్యాణ్ పేర్కొన్నారు. తమను గెలిపించిన నిర్మాతలకు ఎప్పటికీ అండగా ఉంటామని, వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

చదలవాడ శ్రీనివాసరావు సేవా కార్యక్రమాలు ఆయనకు ట్రెజరర్‌గా విజయం సాధించడంలో కీలకంగా నిలిచాయని అన్నారు. నిర్మాతల మండలి మంచి పనులు చేయడానికే ఏర్పడిందని, ఇకపై నిర్మాతలందరూ ఒక్కటై ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత రెండున్నర సంవత్సరాలుగా అందరూ కలిసి ముందుకు సాగలేకపోయామని, ఇకపై కలిసి పనిచేసి నిర్మాతల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రస్తుతం చిన్న నిర్మాతలు సొంత డబ్బుతో సినిమాలు నిర్మించి.. వాటిని విడుదల చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సి.కల్యాణ్ తెలిపారు. చిన్న నిర్మాతల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, త్వరలోనే దానిని మీడియా ద్వారా వెల్లడిస్తామని చెప్పారు. తనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో కీలకంగా సహకరించిన బండ్ల గణేష్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నిర్మాతలందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతల మండలికి దూరంగా ఉన్న సమయంలోనూ నిర్మాతల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. ఆయనను తామే ఒప్పించి ట్రెజరర్ పదవికి పోటీ చేయించామని, నిర్మాతలు భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పారు. నూతన కార్యవర్గం నిర్మాతల సంక్షేమం కోసం గొప్పగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాతల మండలి అభివృద్ధికి ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించబోమని ప్రసన్నకుమార్ స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ ఆశీర్వాదాలు ఉన్నాయి: చదలవాడ శ్రీనివాసరావు

ట్రెజరర్‌గా విజయం సాధించిన చదలవాడ శ్రీనివాసరావు (Chadalavada Srinivasa Rao) తనకు ఇంత భారీ మెజారిటీ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన విజయానికి ఎన్టీఆర్ ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పారు. నందమూరి కుటుంబ సభ్యులంతా తనకు మద్దతుగా నిలవడం ఆనందంగా ఉందని తెలిపారు. నిర్మాతలందరూ ఏకమై తమ ప్యానల్‌ను భారీ స్థాయిలో గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా చిన్న నిర్మాతల అభ్యున్నతి కోసం అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మాతల మండలి అభివృద్ధికి సి.కల్యాణ్, ప్రసన్నకుమార్ ఎంతో కృషి చేశారని, ఇకపై కూడా వారి సేవలు మండలి అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పారు. నిర్మాత సునీల్ నారంగ్ కూడా ఎంతో సహకరించారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిర్మాతల మండలికి అవసరమైన సహకారాన్ని తీసుకురావడానికి సంబంధిత అధికారులను సంప్రదిస్తామని చదలవాడ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

మొత్తంగా చూస్తే.. ఈ ఎన్నికల్లో ‘మన ప్యానల్’ కీలక పదవుల్లో ఆధిపత్యం సాధించడంతో కొత్త కార్యవర్గంపై నిర్మాతల్లో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా చిన్న నిర్మాతల సమస్యలు, సినిమాల విడుదలకు ఎదురవుతున్న ఇబ్బందులు, నిర్మాతల సంక్షేమం వంటి అంశాలపై నూతన కార్యవర్గం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Updated Date - Sep 06 , 2026 | 07:02 PM