సినీ ఫ్యాన్స్ హర్షించేలా సాగిన అవార్డుల ఎంపిక
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:07 PM
'తెలుగు సినిమా'స్టేట్ అవార్డు మొహం చూసి దాదాపు పదేళ్లు కావొస్తుంది. గతంలో నంది అవార్డుల వేడుకను నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆ వేడక కొనసాగలేదు. ఇప్పుడు మళ్లీ ఆంధ్రాలో నంది అవార్డులను పునరుద్దరించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం గతేడాది గద్దర్ అవార్డులను ప్రారంభించి ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారం ప్రదానం చేసింది.
'తెలుగు సినిమా'స్టేట్ అవార్డు మొహం చూసి దాదాపు పదేళ్లు కావొస్తుంది. గతంలో నంది అవార్డుల వేడుకను నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆ వేడక కొనసాగలేదు. ఇప్పుడు మళ్లీ ఆంధ్రాలో నంది అవార్డులను పునరుద్దరించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం గతేడాది గద్దర్ అవార్డులను ప్రారంభించి ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారం ప్రదానం చేసింది. పెండింగ్‌లో ఉన్న అవార్డులను ఒక్కసారిగా క్లియర్ చేసింది. గత సంవత్సరం చక్కగా అవార్డు ఫంక్షన్ సాగడంతో ఈ ఏడాది మరింత జోరు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. గడిచిన సంవత్సం చిన్న చిత్రాలకు పెద్ద పీట వేశారు. ఈ ఏడాదీ అదే జరిగింది.
5 కమిటీలతో.. ఎంపిక
తెలంగాణ ప్రభుత్వం ఆరంభించిన 'తెలంగాణ గద్దర్ ఫిలిమ్ అవార్డ్స్' గత సంవత్సరం విజయవంతంగా సాగింది. ఈ సారి కూడా చలనచిత్ర అభిమానుల్లో అధికశాతం హర్షించేలా 2025 సంవత్సరానికి గాను అవార్డులను ఎంపిక చేసి 'తెలంగాణ గద్దర్ ఫిలిమ్ అవార్డ్స్' కమిటీ ప్రత్యేకతను చాటుకుంది. మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షునిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు- సమీక్షల పరిశీలనకు తనికెళ్ళ భరణి చైర్మన్ గా ఉన్నారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షునిగా వ్యవహరించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అవార్డుల ఫలితాలు అందించిన తర్వాత మీడియాకు వెల్లడించారు. ఎక్కువశాతం అవార్డులు చిన్న చిత్రాలనే వరించాయి. తెలంగాణ జీవితాన్ని, సంస్కృతుల్ని ప్రతిబింబించే సినిమాలకు అగ్ర తాంబూలం దక్కింది. రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ది ప్రీ వెడ్డింగ్ షో, కోర్ట్, లిటిల్ హార్ట్స్ చిత్రాలు ఎక్కువ అవార్డులు దక్కించుకున్నాయి.

చిన్న చిత్రాల జోరు
2025' అవార్డ్స్ లో ప్రథమ ఉత్తమ చిత్రంగా 'రాజు వెడ్స్ రాంబాయ్', ద్వితీయ ఉత్తమ చిత్రంగా 'దండోరా', తృతీయ ఉత్తమ చిత్రంగా 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఎన్నికయ్యారు. జాతీయ సమైక్యతను చాటే చిత్రంగా 'తండేల్' నిలచింది. ఉత్తమ పర్యావరణ చిత్రంగా 'ఈజీడబ్ల్యూఏ', బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిలిమ్ గా 'లిటిల్ హార్ట్స్' గెలిచాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రం కేటగిరీలో ఇచ్చే డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి అవార్డును 'సంక్రాంతికి వస్తున్నాం' దక్కించుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిలిమ్ గా 'మిరాయ్', బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిమ్ గా 'అనగనగా' నిలిచాయి.

ఉత్తమ నటీనటులు... ఆ ఇద్దరు...
రాజు వెడ్స్ రాంబాయ్' చిత్రం ద్వారా సాయిలు కంపాటి ఉత్తమ దర్శకునిగా ఎన్నికయ్యారు. ఉత్తమ నటునిగా 'తండేల్' కథానాయకుడు నాగచైతన్య, ఉత్తమ నటిగా 'ద గర్ల్ ఫ్రెండ్' నాయిక రష్మిక మందన్న ఎంపికయ్యారు. ఉత్తమ సహాయనటులు కేటగిరీలో 'దండోరా' నుండి శివాజీ, 'యుఫోరియా' ద్వారా భూమిక విజేతలుగా నిలిచారు. బెస్ట్ కమెడియన్ గా 'జిగ్రీస్'లో నటించిన కృష్ణతేజ రెడ్డి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'లో నటించిన మాస్టర్ రోహన్ నిలిచారు.
'ఛాంపియన్' తడాఖా...
దండోరా' చిత్రానికి సంగీతం సమకూర్చిన మార్క్ కె.రాబిన్ ఉత్తమ సంగీత దర్శకునిగా నిలిచారు. ఉత్తమ గాయకునిగా 'రాజు వెడ్స్ రాంబాయ్' ద్వారా అనురాగ్ కులకర్ణి గెలవగా, ఉత్తమ గాయనిగా 'కన్నప్ప' నుండి సాహితీ చాగంటి గెలిచారు. 'కుబేర' చిత్రం ద్వారా నందకిషోర్ ఉత్తమ గీత రచయితగా ఎన్నికయ్యారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అనిల్ రావిపూడి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నిలవగా, 'యుఫోరియా'తో గుణశేఖర్ బెస్ట్ స్టోరీ రైటర్ గా గెలిచారు. 'మిరాయ్' చిత్రం ద్వారా కార్తిక్ ఘట్టమనేని బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా ఎన్నికయ్యారు. 'మిరాయ్'తోనే శ్రీకర్ ప్రసాద్ బెస్ట్ ఎడిటర్ గా నిలిచారు. బెస్ట్ ఆడియో గ్రాఫర్ గా 'కిష్కింధపురి'కి పనిచేసిన ఎమ్.ఆర్.రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. 'ఛాంపియన్' తో బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా తోట తరణి, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పీటర్ హెయిన్స్, బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్ గా చంద్రకాంత్, అజయ్ కుమార్ విజేతలుగా నిలిచారు.
ఫీచర్ ఫిలిమ్స్ ద్వారా రోషన్ మేకా, చైతూ జొన్నలగడ్డ, అనంతిక, రాజ్ రాచకొండ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కు ఎన్నికయ్యారు. బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ గా 'యూనిటీ', 'ద ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జైరాజ్', 'మహామనీషి డాక్టర్ ఎ.యస్.రావ్' ఎంపికయ్యాయి. బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో "వనజీవి రామయ్య, మౌనమే నీ భాష, సైబర్ స్లేవరీ" ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. చలనచిత్రాలకు సంబంధించిన ఉత్తమ పుస్తకంగా ప్రభు రాసిన 'శూన్యం నుండి శిఖరాగ్రాలకు' ఎన్నికయింది. బెస్ట్ ఫిలిమ్ క్రిటిక్ గా హెచ్.రమేశ్ బాబు నిలిచారు.
యన్టీఆర్ అవార్డ్ ... చిరంజీవి !
ప్రత్యేక అవార్డుల విషయానికి వస్తే ఈ యేడాదే ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు అవార్డు కోసం ప్రముఖ నటి జయసుధను ఎంపిక చేశారు. అలాగే డాక్టర్ సి.నారాయణ రెడ్డి అవార్డుకు సుద్దాల అశోక్ తేజను ఎన్నుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డును రమేశ్ ప్రసాద్, టి.యల్. కాంతారావు అవార్డును ఆర్.నారాయణమూర్తి, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డును సి.అశ్వనీదత్ అందుకోనున్నారు. బి.యన్.రెడ్డి అవార్డుకు సింగీతం శ్రీనివాసరావు ఎన్నిక కాగా, పైడి జైరాజ్ అవార్డుకు కమల్ హాసన్ ను ఎంపిక చేశారు. యన్టీఆర్ నేషనల్ అవార్డును చిరంజీవికి ప్రదానం చేయనున్నారు. ఉగాది రోజు మార్చి 19వ తేదీన 'తెలంగాణ గద్దర్ ఫిలిమ్ అవార్డ్స్' వేడుక హైదరాబాద్ హైటెక్స్ లో సాగనుంది. గత సంవత్సరం కొందరు సినీ సెలబ్రిటీలు అవార్డు అందుకోవడానికి రాలేదు. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఫైర్ అయ్యారు. మరి ఈ సారి అందరూ హాజరవుతారో లేదో చూడాలి.