Telangana Exhibitors: పర్సంటేజ్‌ విధానం కావాల్సిందే.. ఎగ్జిబిటర్ల డిమాండ్‌..

ABN , Publish Date - May 24 , 2026 | 02:00 PM

టాలీవుడ్‌ నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్‌కు మధ్య కొంత కాలంగా పర్సంటేజ్‌, రెంటల్‌ విధానంపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే!

టాలీవుడ్‌ నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్‌కు మధ్య కొంత కాలంగా పర్సంటేజ్‌, రెంటల్‌ విధానంపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే! తెలంగాణలో థియేటర్లు పర్సంటేజ్‌ విధానంపైనే (Telangana Exhibitors) నడవాలని ఎగ్జిబిటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో నిర్మాతల నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తెలంగాణలో పర్సంటేజ్‌ విధానంలోనే సినిమాలు ఆడతాయని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. త్వరలో విడుదల కానున్న ‘పెద్ది’ సినిమా కూడా ఇదే విధానంలో నడుస్తుందని, ఆ సినిమాకు కూడా పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం 120 మంది థియేటర్‌ యజమానులు దీనస్థితిలో ఉన్నారని.. ఎగిబిటర్లకి ఆదాయం రావడం లేదని.. కానీ, నిర్మాతలకు 14 రకాలుగా ఆదాయం వచ్చి పడుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా పర్సంటేజ్‌ విధానం నడుస్తుంటే ఇక్కడ మాత్రమే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తమకు పర్సంటేజ్‌ విధానం కావాల్సిందేనని.. అది ఏ లెక్కన ఇస్తారో చెప్పాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్‌ను ఎన్నుకున్నారు. శనివారం హైదరాబాద్‌లో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో తెలంగాణ ఎగిబిటర్లు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ సెక్రటరీ శ్రీధర్‌ మాట్లాడుతూ ‘తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కమిటీతో పలుమార్లు చర్చలు జరిగాయి. ‘హరి హర వీరమల్లు’ విడుదల టైమ్‌లో రెండు నెలల్లో మా సమస్యని పరిష్కరిస్తారిస్తామని మాటిచ్చారు. చూస్తుండగా ఏడాది గడిచిపోయింది. కావాలనే నిర్మాతలు ఆలస్యం చేస్తున్నారు. ముందు మూడు వారాలని చెప్పారు. ఇప్పుడు మరో మూడు వారాలు వాయిదా వేస్తున్నారు. ఇకపై పర్సంటేజ్‌ ప్రకారమే సినిమాలు నడుస్తాయి. ‘పెద్ది’ సినిమా మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు. ఆ సినిమాను ఈ గొడవ నుంచి మినహాయించాలనుకున్నాం. కానీ, ఆ తర్వాత సమస్య ఎప్పుటికి పరిష్కారమవుతుందన్నది క్లారిటీ లేదు. అందుకే పెద్దికి కూడా పర్సంటే శ్లాబ్‌లో చేర్చాలనుకుంటున్నాం. ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరక్కపోతే చిరంజీవి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాం. ‘పెద్ది’ సినిమాకి ఆంధ్రాలో టికెట్‌ రేట్లు పెంపు ఉండొచ్చు కానీ తెలంగాణాలో లేదు’ అన్నారు. తెలంగాణలో టికెట్‌ రేట్లు పెంచవద్దని, ప్రేక్షకుల్ని చంపొద్దని సీఎం రేవంత్‌రెడ్డికి, ఎగ్జిబిటర్లకు, ఛాంబర్‌ఖు లేఖ ఇచ్చామన్నారు. టికెట్‌ రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంటే.. డిమాండ్‌ అండ్‌ సప్లై ఆధారంగా తమ నిర్ణయం ఉంటుందని తెలిపారు.

Updated Date - May 24 , 2026 | 02:10 PM