రేవంత్ రెడ్డి: నెట్‌ఫ్లిక్స్.. ఐలైన్ సంస్థలకు స్వాగతం
ABN , Publish Date - Mar 12 , 2026 | 08:51 PM
'ఐలైన్, నెట్‌ఫ్లిక్స్‌లను తెలంగాణకు స్వాగతించడం హైదరాబాద్‌కు గర్వకారణం. నెట్‌ఫ్లిక్స్‌కు నగరం సహజ నిలయంగా నిలుస్తుంది.
'ఐలైన్(Eyeline Studio), నెట్‌ఫ్లిక్స్‌లను (Netflix) తెలంగాణకు స్వాగతించడం హైదరాబాద్‌కు గర్వకారణం. నెట్‌ఫ్లిక్స్‌కు నగరం సహజ నిలయంగా నిలుస్తుంది. హైదరాబాద్, నెట్ ఫ్లిక్స్ రెండూ కూడా గ్లోబల్‌గా సక్సెస్ అయ్యాయి. ఈ రెండూ కూడా ఎన్నెన్నో కొత్త అవకాశాల్ని, ఉద్యోగాల్ని సృష్టిస్తూ విజయవంతంగా దూసుకుపోతోన్నాయి. అనేక విధాలుగా నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ రెండూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను, ప్రతిభను కలిపే ద్వారాలు' అని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఐలైన్ స్టూడియోను నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రారంభించింది. దీనిని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలోకి ఐలైన్ స్టూడియోస్ CEO జెఫ్ షాపిరో, భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, రానా దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 'హైదరాబాద్ ఎప్పుడు సృజనాత్మకత, సాంకేతికత, ప్రతిభకు నిలయంగా ఉంది. భవిష్యత్తుకి తగ్గ కథల్ని చెప్పే, రూపొందించే కంపెనీలకు సహజ నిలయంగా మారింది. ఐలైన్ ఉనికి హైదరాబాద్ చలనచిత్రం, సాంకేతికత, AVGC రంగానికి ప్రముఖ కేంద్రంగా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాను. హైదరాబాద్ నుండి ప్రపంచానికి టాలెంట్, మన స్టోరీలు చెప్పడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నందున వారి ప్రయాణానికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాను’ అని అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ 'దాదాపు 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ. టెడ్ సరండోస్ ఆ సమయంలో పరిశ్రమతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించాడు. నేడు, జెఫ్ షాపిరో వంటి వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఈ ప్రదేశం గురించి సృజనాత్మకతకు తదుపరి కేంద్రంగా మాట్లాడటం హైదరాబాద్ ఎంత వరకు అభివృద్ధి చెందిందో అర్థం అవుతోంది. వరల్డ్ స్థాయి క్వాలిటీ ఉన్న చిత్రాలను డిమాండ్ చేస్తున్న ప్రేక్షకులకు ముందుగా థాంక్స్. ఆల్రెడీ సినిమా నిర్మాణంలో మన వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఐలైన్ స్టూడియోస్ ఇక్కడికి రావడంతో ఇండస్ట్రీకి మరింత మద్దతు ఇచ్చినట్టు అయింది' అని అన్నారు.