Tharun-Eesha: తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బ.. మళ్లీ జోరందుకున్న డేటింగ్ రూమర్స్..
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:05 PM
టాలీవుడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బ మధ్య రిలేషన్‌షిప్ ఉందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే
టాలీవుడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్(Tharun Bhasker) , హీరోయిన్ ఈషా రెబ్బ (Eesha Rebba) మధ్య రిలేషన్‌షిప్ ఉందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్ట్, షాపింగ్ మాల్స్ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీడియోలు నెట్టింట వైరల్‌గా కాగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదే విషయాన్ని వీరిద్దరి ముందు ఉంచినప్పుడు 'సమయం వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయి' అంటూ జారుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి ఇప్పటి దాకా అధికారికంగా ఎక్కడా మాట్లాడలేదు. వినాయక చవితి సందర్భంగా తరుణ్ భాస్కర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో ఈ చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. పండుగ సందర్భంగా ఇంట్లో వినాయకుడికి పూజ చేసిన అనంతరం తీసుకున్న ఫొటోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో తరుణ్ భాస్కర్‌తో పాటు ఈషా రెబ్బ కూడా ఉన్నారు. దీనితో అభిమానుల దృష్టి ఈ ఫొటోపైనే పడింది.
అయితే ఈ ఫొటోకు తరుణ్ భాస్కర్ ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. ఈషా రెబ్బ కూడా దీనిపై ఏ కామెంట్ చేయలేదు. అయినప్పటికీ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇంతకాలం వినిపిస్తున్న డేటింగ్ రూమర్స్‌కు ఇది ఓ హింట్ కావచ్చంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి వార్త చెప్పబోతున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టుపై నటి కావ్యా కల్యాణ్‌రామ్ చేసిన కామెంట్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ‘‘ఈ ఫొటోలో పండగ రోజు మంచి పులిహోర తిన్న ఫీల్ ఉంది’’ అంటూ సరదాగా కామెంట్ చేయడంతో పోస్టు మరింత వైరల్‌గా మారింది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కలిసి ‘ఓం శాంతి శాంతిః’ చిత్రంలో నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలు కొనసాగుతూ వచ్చాయి.