Tammareddy Bharadwaj: ప్యారడైజ్ నెగిటివ్ రివ్యూ.. పురుగులు పట్టి చస్తారు
ABN , Publish Date - Oct 02 , 2026 | 08:12 PM
న్యాచురల్ స్టార్ నాని నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ప్యారడైజ్ (Paradise) సినిమాకు మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్, తక్కువ రేటింగ్స్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే.
న్యాచురల్ స్టార్ నాని (Nani) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ప్యారడైజ్ (Paradise) సినిమాకు మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్, తక్కువ రేటింగ్స్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు చాలామంది నెగిటివ్ రివ్యూలు కావాలనే ఇచ్చారని టాక్. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, దర్శక-రచయిత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ఫలితంపై, ఇండస్ట్రీలో దాగి ఉన్న పిఆర్ కుట్రలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రివ్యూల వల్ల సినిమా కలెక్షన్లు ఆగవని, ప్రేక్షకులకు నచ్చితే ఏ శక్తి ఆపలేదని ఆయన స్పష్టం చేశారు.
సినిమా కలెక్షన్ల లెక్కలను వెల్లడిస్తూ.. ప్యారడైజ్ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించిందని, ఒక్క భారతదేశంలోనే రూ. 120 కోట్లు వసూలు చేసి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని తెలిపారు. తొలిరోజే రూ. 34.65 కోట్లు సాధించిందని, నైజాం డిస్ట్రిబ్యూటర్లకు రూ. 30 కోట్ల వరకు వచ్చి ఇప్పటికే లాభాల్లోకి వెళ్లారని చెప్పారు. ఎంత నెగెటివిటీ ప్రచారం చేసినా, రివ్యూలలో 1.5 రేటింగ్ ఇచ్చినా థియేటర్లకు జనాలు రావడం ఆపలేదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో, ప్రణాళికాబద్ధంగా సినిమాలపై నెగెటివ్ ప్రచారం చేయించే పిఆర్ వ్యవస్థ, దుష్ప్రచారం చేసే బ్యాచ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎదుటి మనిషి కష్టపడి తీసిన సినిమా నాశనం కావాలని కోరుకుంటూ, డబ్బులు ఖర్చు పెట్టి మరీ నెగెటివ్ ప్రచారం చేయించేవాళ్లు మనుషులే కాదని మండిపడ్డారు. ఒకవేళ ఇండస్ట్రీలో నిజంగానే అలా ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తూ ఒక సినిమాను చంపాలని చూస్తే.. 'అలాంటి పిచ్చి పనులు చేసేవాళ్లు నా లెక్కలో పురుగులు పట్టి చస్తారు, వాళ్లకు ఆ శాపం తగులుతుంది' అంటూ ఘాటైన శాపనార్థాలు పెట్టారు.
అంతిమంగా, రివ్యూలకు భయపడాల్సిన అవసరం ఏ హీరోకి లేదా నిర్మాతకు లేదని తమ్మారెడ్డి ధైర్యం చెప్పారు. గతంలో లీక్ అయినా అత్తారింటికి దారేది, టాక్సీవాలా వంటి సినిమాలు ఎలా బ్లాక్‌బస్టర్లు అయ్యాయో గుర్తుచేస్తూ.. సినిమా నచ్చితే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని అన్నారు. కాబట్టి ప్రమోషన్ల కోసం రివ్యూయర్లకు భయపడి లంచాలు ఇవ్వడం, కంగారుపడి స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఆపేసి, నమ్మిన కథతో సిన్సియర్‌గా సినిమాలు తీయాలని చిత్రబృందాలకు సూచించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.