NBK 112: బాలకృష్ణ‌ - కొరటాల మూవీలో.. కోలీవుడ్ స్టార్‌ హీరో?

ABN , Publish Date - Aug 30 , 2026 | 03:57 PM

బాలకృష్ణ - కొరటాల శివ మొద‌టి కాంబినేషన్‌గా వస్తున్న మొదటి సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

NBK112

నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మాస్ ఎంటర్‌టైనర్లతో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK111' వర్కింగ్ టైటిల్‌తో ఒక పవర్ ప్యాక్డ్ సినిమా చేస్తున్నారు. 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ ఒక కీలకమైన, పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే, బాలయ్య తన తదుపరి చిత్రం NBK112 కోసం సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో నందమూరి అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కాల్సి ఉంది. అయితే బాలయ్యకు గాయం కావడంతో షూటింగ్ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటుండగా, అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను వేగవంతం చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఒక కోలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. కోలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో ఆర్య (Arya). కొరటాల శివ ఈ సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్‌ను చాలా పవర్ ఫుల్‌గా, ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఆ క్యారెక్టర్ కోసం ఆర్యను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆర్యకు తెలుగు ప్రేక్షకులతో మంచి అనుబంధమే ఉంది. గతంలో అల్లు అర్జున్ 'వరుడు' సినిమాలో విలన్‌గా మెప్పించిన ఆర్య, ఆ తర్వాత అనుష్క 'సైజ్ జీరో', వెంకటేష్ 'సైంధవ్' చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు. ఇప్పుడు బాలయ్య సినిమాలో ఈ పోలీస్ రోల్ కనుక ఆర్య ఖరారైతే సినిమా రేంజ్ మరోలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సాధారణంగా కొరటాల శివ సినిమా అనగానే కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, బలమైన సామాజిక నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు ఉంటాయి. 'దేవర' తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బాలయ్యను ఇప్పటివరకు చూడని ఒక పూర్తి స్థాయి మాస్, ఎమోషనల్ అవతార్‌లో చూపించబోతున్నారట. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరి బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలంటే సినిమా విడుదల అయ్యే వరకు ఎదురుచూడక తప్పదు.

Updated Date - Aug 30 , 2026 | 04:25 PM