Tamannaah: ఏరుదాటాక తెప్ప తగలేసిందిగా..

ABN , Publish Date - Jun 24 , 2026 | 06:11 PM

ఉత్తరాది భామలు ఛాన్సుల కోసం దక్షిణాదికి పరుగులు తీస్తూ వస్తుంటారు... బిజీగా ఉన్నంత కాలం సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తేస్తారు. అవకాశాలు తగ్గగానే ఇదే సౌత్ మూవీస్ పై రాళ్ళు వేస్తూంటారు... అలా రాళ్ళేసిన వారి జాబితాలో మిల్క్ బ్యూటీ కూడా చేరింది.

Tamannaah Bhatia

ఉత్తరాది భామలు ఛాన్సుల కోసం దక్షిణాదికి పరుగులు తీస్తూ వస్తుంటారు... బిజీగా ఉన్నంత కాలం సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తేస్తారు. అవకాశాలు తగ్గగానే ఇదే సౌత్ మూవీస్ పై రాళ్ళు వేస్తూంటారు... అలా రాళ్ళేసిన వారి జాబితాలో మిల్క్ బ్యూటీ కూడా చేరింది. ఉత్తరాన కన్నుతెరచినా దక్షిణాది చిత్రాలతోనే తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోయిన్ గా విశేషమైన పేరు సంపాదించింది. మిల్క్ బ్యూటీగా సౌత్ ఆడియెన్స్ మదిలో చెరిగిపోని ముద్ర వేసింది. హీరోయిన్ గానే చేస్తానని మడి కట్టుకు కూర్చోకుండా అందివచ్చిన అవకాశాన్నల్లా ఉపయోగించుకుంది తమన్నా... ఐటమ్ గాళ్ గానూ భళా అనిపించింది. ఆమె నటించిన చివరి తెలుగు చిత్రం ఓదెల-2 అట్టర్ ఫ్లాపయింది... అంతకు ముందు తమన్నా నటించిన తెలుగు సినిమాలు .. గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ వంటివి కూడా అంతగా అలరించలేదు. ఇక తమిళంలో ఆమె నర్తించిన జైలర్ మాత్రమే మురిపించింది. అంతకు ముందు నటించిన పలు సౌత్ మూవీస్ కూడా పరాజయం బాట పట్టాయి. అలాంటి తమన్నాకు ప్రస్తుతం సౌత్ లో ఒకే ఒక తమిళ చిత్రం చేతిలో ఉంది. ఐదు హిందీ సినిమాల్లోనూ కీ రోల్స్ లో కనిపించనుంది. అందువల్లే కాబోలు అమ్మడు తనను స్టార్ హీరోయిన్ గా మార్చిన సౌత్ సినిమాపై రాళ్ళు వేస్తోంది. దక్షిణాదిలో హీరోయిన్లను గౌరవప్రదంగా కాకుండా, గ్లామర్ కోణంలోనే చూస్తారు అన్న అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. దాంతో సౌత్ లో ఆమెకు అవకాశాలు ఇచ్చిన సినీజనం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.


'హిందీ చిత్రపరిశ్రమలో రెండు రకాల నటీనటులు ఉంటారు. కళాత్మక దృక్పథం ఉన్నవారు కొన్ని రకాల పాత్రలకు సరిపోతారు. వారు గ్లామరస్ గా ఉండే పాత్రలు, డ్యాన్సులు చేయలేకపోవచ్చు.. హిందీ పరిశ్రమ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునే లేదా రెండింటినీ ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగినవారే సూపర్ స్టార్ అవుతారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువ. హీరోయిన్లను చూసే విధానం అంత ప్రశంసనీయంగా అనిపించదు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే' అని చెప్పుకొచ్చింది. అంటే ఇప్పటివరకు తెలుగులో తమన్నా గ్లామర్ పాత్రలే చేసిందా.. బాహుబలి, సైరా నరసింహారెడ్డి, ఓదెల 2 .. ఇలా ఎన్నో సినిమాల్లో ఆమె నటన హైలైట్ గా మారింది. ఇవన్నీ ఆమెకు గుర్తు రాలేదా.. ఏరు దాటాక తెప్ప తగలేయడమంటే ఇదే.. అవకాశాలు ఉన్నంత సేపు.. టాలీవుడ్ దేవాలయం అని చెప్పడం.. అవకాశాలు లేనప్పుడు ఇలా రాళ్ళు వేయడం హీరోయిన్లకు అలవాటుగా మారిపోయింది. అంతెందుకు ఈ తమన్నానే.. ఓదెల 2 సమయంలో టాలీవుడ్ ని పొగడ్తలతో ముంచెత్తిందని నెటిజన్స్ గుర్తుచేసుకుంటున్నారు.


కేవలం తమన్నా మాత్రమే కాదు.. అంతకుముందు చాలామంది హీరోయిన్స్ కూడా ఇలాగే మాట్లాడారు. అవకాశాలు తగ్గగానే దక్షిణాది చిత్రసీమపై విమర్శలు గుప్పించారు. అలాంటి వారిలో లెజెండ్ లో నటించిన రాధికా ఆప్టే, తెలుగు సినిమా ఝుమ్మంది నాదంతో వెలుగు చూసిన తాప్సీ పన్ను, తెలుగు చిత్రాలతో స్టార్ డమ్ చూసి తరువాత బాలీవుడ్ బాట పట్టిన ఇలియానా ఉండటం గమనార్హం. రాధికా ఆప్టే, తాప్సీ సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ అవకాశాలు సంపాదించారు... బాగానే ఉంది... అయినా సౌత్ లో లాభపడి, ఇక్కడి సినిమారంగాన్ని చిన్నచూపు చూడటం విచారకరం. వారి కన్నా మిన్నగా దక్షిణాది చిత్రసీమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గా రాణించిన ఇలియానా, తమన్నా వారిలాగే కామెంట్స్ చేయడం శోచనీయం అని చెప్పొచ్చు. ఏదిఏమైనా ఇంత మాట అన్నాక తెలుగులో మళ్ళీ తమన్నాను చూడడం కష్టమే.

Updated Date - Jun 24 , 2026 | 06:30 PM