విశ్వనాథ్ అండ్ సన్స్.. అప్పుడే అన్ని కోట్లు లాభమా?

ABN , Publish Date - Aug 13 , 2026 | 02:13 PM

వర్సటైల్ స్టార్ హీరో సూర్య, యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్లను అందించే యువ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్.

Vishwanath and Sons

కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య, యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్లను అందించే యువ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons). 'సార్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అటు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సూర్య హీరోగా నటిస్తుండటంతో మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని రూ. 130 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే అసలు మేజిక్ ఇక్కడే జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 90 కోట్లకు అమ్ముడుపోగా.. డిజిటల్, శాటిలైట్, ఆడియో వంటి నాన్-థియేట్రికల్ హక్కులు రూ. 125 కోట్లు పలికాయి. అంటే మొత్తంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూపంలోనే ఈ చిత్రం రూ. 215 కోట్లు రాబట్టింది. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే మేకర్స్‌కు ఏకంగా రూ. 85 కోట్ల భారీ టేబుల్ ప్రాఫిట్ దక్కింది.

సూర్య (Suriya) ఇటీవల నటించిన 'కరుప్పు' చిత్రం బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ. 320 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఆ సూపర్ హిట్ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ ఊపును ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో కూడా కంటిన్యూ చేస్తానని సూర్య చాలా ధీమాగా ఉన్నారు. అంతేకాదు, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సాంగ్స్ యూట్యూబ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

మరోవైపు నిర్మాత సూర్యదేవర నాగవంశీకి కూడా ఇది గోల్డెన్ ఫేజ్ అని చెప్పాలి. ఇటీవల ఆయన నిర్మాణంలో వచ్చిన 'లెనిన్' చిత్రం భారీ వసూళ్లు రాబట్టి, అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో అటు హీరో సూర్యకు, ఇటు నిర్మాతలకు 'విశ్వనాథ్ అండ్ సన్స్' విజయాన్ని అందిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి మేకింగ్, కథనంలో ఉండే ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఇక ఈ చిత్రంలో 'ప్రేమలు' చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న క్యూట్ బ్యూటీ మమిత బైజు సూర్యకు జోడీగా నటిస్తోంది. అలాగే రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ ఈ మూవీలో అత్యంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలు, మైండ్ బ్లోయింగ్ బిజినెస్ లెక్కలతో ఈ శుక్రవారం వస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద ఎంతటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Updated Date - Aug 13 , 2026 | 03:14 PM