Vishwanath and Sons Trailer: సూర్య - మమితా బైజు ఎమోషనల్ రైడ్.. హిట్ పక్కా

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:29 PM

కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య , ప్రేమలు బ్యూటీ మమితా బైజు జంటగా నటించిన ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా విశ్వనాథ్ అండ్ సన్స్.

Vishwanath and Sons

కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య (Suriya), ప్రేమలు బ్యూటీ మమితా బైజు (Mamitha Baiju) జంటగా నటించిన ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons). సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో రవీనా టాండన్ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 14 న ఈ సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.


సుమారు 2 నిమిషాల 50 సెకన్ల నిడివితో సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం బంధాలు, బాధ్యతలు, ప్రేమ, కుటుంబం చుట్టూ తిరిగే విభిన్నమైన ఎమోషన్లతో రూపుదిద్దుకుంది. సంజయ్ విశ్వనాథ్ ఒక షూటర్. భార్యతో విడిపోయిన అతనికి ఒక బాబు ఉంటాడు. అయితే చిన్న వయస్సులోనే ఆ బాబుకు బోన్ మారో మార్చాల్సి వస్తుంది. డబ్బున్న సంజయ్.. ప్రపంచం మొత్తం వెతికి తన కొడుకుకు సరిపడే బోన్ మారో ఉన్న మ్యాడీని తీసుకొస్తాడు. అల్లరి చిల్లరగా తిరిగే మ్యాడీ డబ్బు కోసం సంజయ్ ఇంటికి వస్తుంది. బాబుకు సర్జరీ అయ్యేలోపు సంజయ్ తో ప్రేమలో పడుతుంది. కానీ, ఆమె ప్రేమను అతను రిజెక్ట్ చేస్తాడు. దానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న 20 ఏళ్ల వయస్సు వ్యత్యాసం. అసలు సంజయ్ భార్యతో ఎందుకు విడిపోయాడు.. ? తనకన్నా చిన్న వయస్సు ఉన్న అమ్మాయి తనను ప్రేమిస్తుందని తెలిసి ఏం చేశాడు.. ? చివరికి మ్యాడీ ఏమైంది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


'మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు.. ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక'.. ' గెలిచేదాక ఆగకూడదు.. గెలిచాక ఆ గెలుపు గురించి మాట్లాడకూడదు' లాంటి వెంకీ అట్లూరి మార్క్ ఆలోచింపజేసే సంభాషణలు ప్రేక్షకుల మనసులను తాకుతున్నాయి. కథానాయకుడిగా సూర్య మెచ్యూర్డ్ అండ్ స్టైలిష్ పర్ఫార్మెన్స్, మమితా బైజు క్యూట్ లుక్స్, ఎమోషనల్ సీన్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివర్లో జ్యోతిక చంద్రముఖి డైలాగ్ ని సూర్య మీద సెటైర్ వేయడం నవ్వులు పూయించింది. ఇక జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన హృదయాలను హత్తుకునే సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని ప్రతీ ఫ్రేమ్‌ను మరింత సజీవంగా మార్చాయి. కుటుంబ కథా చిత్రాలకు ఉండే అందమైన ఫీల్, హృదయాన్ని కదిలించే డ్రామాగా విశ్వనాథ్ అండ్ సన్స్ ఉండబోతుందని ట్రైలర్ ని బట్టి అర్ధమవుతోంది. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Aug 07 , 2026 | 05:38 PM