సురేందర్‌ రెడ్డి: సందిగ్ధంలో పవన్ సినిమా... రీ-రిలీజ్‌కు మూడు చిత్రాలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:34 AM

పవన్ కళ్యాణ్‌తో సురేందర్ రెడ్డి చేయాల్సిన సినిమా విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఏప్రిల్, మే నెలల్లో సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు రీ-రిలీజ్‌ అవుతుండటం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

Surendar Reddy

దర్శకుడు సురేందర్ రెడ్డి కెరీర్ ఇప్పుడు డోలాయమానంలో ఉంది. మెగాస్టార్ చిరంజీవితో 'సైరా' సినిమా చేసిన తర్వాత అఖిల్ అక్కినేనితో అతను తెరకెక్కించిన 'ఏజెంట్‌' సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించే సినిమా ఉంటుందని అన్నారు.

నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో మొదలయ్యాయి. అయితే ఈ లోగా ఎన్నికలు రావడం, పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం దీనికి ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికే పవన్ ప్రాధాన్యమిచ్చారు. అయితే కొద్ది కాలం క్రితం సురేందర్ రెడ్డి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఈ సినిమా నిర్మాత రామ్ తాళ్ళూరి జనసేన కార్యదర్శిగా కీలక బాధ్యతలను నెరవేర్చుతున్నారు. దాంతో ఆయనకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలనుకున్నారని తెలిసింది.


తాజాగా విడుదలైన 'ఉస్తాద్ భగత్‌ సింగ్' మూవీ పరాజయంతో పవన్ కళ్యాణ్‌ తిరిగి మనసు మార్చుకున్నారని, ఇప్పటిలో కొత్త సినిమాలేవీ కమిట్ కాదల్చుకోలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. అయితే... ఇప్పటికే మాట ఇచ్చిన సురేందర్ రెడ్డి సినిమాను కూడా ఆయన హోల్డ్ లో పెట్టారో లేదో తెలుపలేదు. ఆయన నిర్ణయం సురేందర్ రెడ్డి సినిమాకు వర్తించదని, అది కాకుండా వేరే ఏ కొత్త సినిమా ఆయన చేయకూడదనుకున్నారని కొందరు చెబుతున్నారు. కానీ రామ్ తాళ్ళూరి లేదా సురేందర్ రెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్‌ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లేది చెప్పడం లేదు. ఇలాంటి సందిగ్ద పరిస్థితుల్లో సురేందర్ రెడ్డి గతంలో దర్శకత్వం వహించిన మూడు సినిమాలు ఏడు వారాల గ్యాప్ లో రిలీజ్ కానుండటం చర్చనీయాంశంగా మారింది.


అందులో మొదటిది అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన 'రేసు గుర్రం'. ఈ సినిమా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రీ-రిలీజ్ అవుతోంది. అలానే మే 20న జూనియర్ ఎన్టీఆర్‌ బర్త్ డే సందర్భంగా సురేందర్ రెడ్డి ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన 'ఊసరవెల్లి' సినిమాను రీ-రిలీజ్‌ చేయబోతున్నారు. ఇక సురేందర్ రెడ్డి మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కించిన స్టైలిష్‌ యాక్షన్ మూవీ 'అతిథి'ని కృష్ణ జయంతి మే 31 సందర్భంగా మే 29న రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఒకే దర్శకుడు ముగ్గురు స్టార్ హీరోలతో తీసిన మూడు సినిమాలు ఏడు వారాల వ్యవథిలో విడుదల కావడం విశేషమనే చెప్పాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్‌ సినిమా ఇప్పట్లో ఉండకపోతే... సురేందర్ రెడ్డి వేరే ఏ ప్రాజెక్ట్ అయినా టేకప్ చేస్తారేమో చూడాలి.

Updated Date - Mar 31 , 2026 | 11:34 AM