ఉస్తాద్ భగత్‌ సింగ్ టికెట్ రేట్ల పెంపుకు మార్గం సుగమం!

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:49 PM

'ఉస్తాద్ భగత్‌ సింగ్' సినిమాకు సుప్రీమ్ కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హై కోర్టు టిక్కెట్ రేట్ల పెంపుపై విధించిన నిబంధనపై సుప్రీమ్ కోర్టు స్టే విధించింది. దాంతో ఈ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే ఆస్కారం తెలంగాణా లోనూ ఏర్పడింది.

Ustaad Bhagath Singh Movie

అభిమానుల్లో ఉరకలు వేసే ఉత్సాహం నింపుతోంది పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏపీలో ఈ మూవీకి టిక్కెట్ రేట్స్ పెంచనున్నారని తెలుస్తోంది. అంతేకాదు... తెలంగాణలోనూ ఈ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి మార్గం సుగమం అయ్యింది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ హోప్స్ ను పెంచుతూ గురువారం రిలీజయిన ఇందులోని 'కాలరే ఎత్తరా...' సాంగ్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేసేలా చేస్తోంది. మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్'కు ప్రీమియర్ షోస్ ఉంటాయా? లేదా అన్న అనుమానం ఫ్యాన్స్ లో నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటిలాగే ఈ మూవీ బెనెఫిట్ షోస్ వేయాలని, అలాగే టిక్కెట్ రేట్స్ పెంచుకొనేలా వీలు కల్పించమని అక్కడి ప్రభుత్వాన్ని 'మైత్రీ మూవీమేకర్స్' సంస్థ ప్రతినిధులు కోరినట్టు తెలుస్తోంది. బెనిఫిట్ షోస్ రేటు 500 రూపాయలుగానూ, మల్టీప్లెక్స్ లో 125 రూపాయలు, సింగిల్ థియేటర్స్ లో 100 రూపాయలు పెంచమని అప్లై చేశారు.


ఆంధ్రప్రదేశ్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' హీరో పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి కావడం వల్ల అక్కడ టిక్కెట్ రేట్స్ హైక్ కు ఏలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. అయితే తెలంగాణలో ఇంతకు ముందు స్టార్ మూవీస్‌కు టిక్కెట్ రేట్స్ హైక్‌ను వ్యతిరేకిస్తూ పలువురు హై కోర్టును ఆశ్రయించారు. ఏ సినిమాకైనా టిక్కెట్ రేట్స్ పెంపుకై 90 రోజులు ముందు ప్రభుత్వం జీవో జారీచేయాలంటూ హైకోర్టు నిబంధన విధించింది. దానిని సవాల్ చేస్తూ మైత్రీ మూవీమేకర్స్ సంస్థ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి, '90 రోజుల నిబంధన'పై స్టే విధించింది. ప్రస్తుతానికి టిక్కెట్ ధరల పెంపుపై గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని సుప్రీమ్ కోర్టు సూచించింది. దీంతో తెలంగాణలోనూ 'ఉస్తాద్ భగత్ సింగ్' టిక్కెట్ రేట్స్ హైక్ కు లైన్ క్లియర్ అయింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' టిక్కెట్ ధరల పెంపుపై సుప్రీమ్ కోర్టు సానుకూలంగా స్పందించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అదరహో అనేలా రికార్డ్ క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. పైగా మార్చి 19వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా సెలవు ఉంటుంది కాబట్టి, 'ఉస్తాద్...'కు వసూళ్ళ వర్షాలే కురుస్తాయనీ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి 'ఉస్తాద్ భగత్ సింగ్' ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

Updated Date - Mar 13 , 2026 | 03:53 PM