నటి ప్రత్యూష కేసు: నిందితుడు సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాల్సిందే!
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:42 AM
హీరోయిన్ ప్రత్యూష (Prathyusha case) కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీం కోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. నాలుగు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది.
హీరోయిన్ ప్రత్యూష (Prathyusha case) కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీం కోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. నాలుగు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. పోస్టుమార్టంను అన్ ప్రొఫెషనల్‌గా నిర్వహించారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 2002 ఫిబ్రవరి 23న నటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి కలిసి పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగడంతో ఆస్పత్రి పాలయ్యారు. పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు ప్రత్యూష మరణించింది. సిద్ధార్థ రెడ్డి చికిత్స తర్వాత కోలుకును బయటపడ్డాడు. ఇది ఆత్మహత్యాయత్నమా లేక ఆత్మహత్యకు ప్రేరేపించడమా అనే దానిపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ముమ్మాటికీ ఇది హత్యేనని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. దానితో సీబీఐ దర్యాప్తు తర్వాత సిద్ధార్థ రెడ్డిపై సెక్షన్ 306 కింద కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో 2004లో సిద్ధార్థ రెడ్డికి సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
2011లో హైకోర్టు ఈ కేసులో విధించిన శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ రూ.50,000 జరిమానా కూడా విధించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష తల్లి సరోజిని 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థ రెడ్డి అప్పీల్ చేయగా, నిందితుడికి శిక్ష పెంచాలని కోరుతూ సరోజిని పిటిషన్ వేశారు. 2025 నవంబర్‌లో ఈ అప్పీల్స్‌పై సుప్రీంకోర్టు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా వెలువడిన తుది తీర్పులో సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానాను సుప్రీం ధర్మాసనం సమర్థించింది.
‘రాయుడు’ సినిమాతో ప్రత్యూష నటిగా వెండితెరకు పరిచయమయ్యారు. అందులో మోహన్‌బాబుకి కుమార్తెగా నటించి మెప్పించారు. తర్వాత ‘శ్రీరాములయ్య’, ‘సముద్రం’, ‘స్నేహమంటే ఇదేరా’ వంటి చిత్రాల్లో నటించారు. ఉదయ్‌కిరణ్‌తో నటించిన ‘కలుసుకోవాలని’ తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం. నాలుగేళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ భాషల్లో 11 చిత్రాల్లో నటించారు ప్రత్యూష.