సింహాసనం:  తెలుగులో తొలి 70ఎమ్ఎమ్.. 4 షోలతో శతదినోత్సవం

ABN , Publish Date - Mar 21 , 2026 | 02:50 PM

నటశేఖర కృష్ణ తొలిసారి మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చిత్రం 'సింహాసనం' మార్చి 21తో 'సింహాసనం' 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం...  

మొదటి నుంచీ నటరత్న యన్టీఆర్ ను అభిమానిస్తూ ఆయన సాగిన పంథాలోనే పయనిస్తూ వచ్చారు కృష్ణ. ఎన్టీఆర్ లాగే తానూ దర్శకత్వం వహించాలని కృష్ణ ఏనాటి నుంచో ఆశిస్తూ వచ్చారు. యన్టీఆర్ తాను నటునిగా అడుగు పెట్టిన 12 ఏళ్ళకు దర్శకత్వం వహిస్తూ తొలి ప్రయత్నంగా 'సీతారామ కళ్యాణం' అనే పౌరాణికం రూపొందించారు. కృష్ణ తాను చిత్రసీమలో ప్రవేశించిన 21 సంవత్సరాలకు మెగాఫోన్ పట్టి  మొదటి చిత్రంగా జానపద కథతో 'సింహాసనం' తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మాలయా పతాకంపై కృష్ణ సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు నిర్మించారు. తెలుగులో మొట్టమొదటి 70 ఎమ్.ఎమ్. సినిమాగా 'సింహాసనం' వెలుగు చూసింది. ఈ చిత్రంలో జయప్రద, మందాకిని నాయికలు. సత్యనారాయణ, వహిదా రహమాన్, ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి, ఎమ్.బాలయ్య, కాంతారావు ఇతర ముఖ్యపాత్రధారులు. బప్పిలహిరి స్వరకల్పనలో వేటూరి, ఆత్రేయ పాటలు పలికించారు.
 


ద్విభాషా చిత్రంగా 'సింహాసనం'
'సింహాసనం' చిత్రం భారీ ఓపెనింగ్స్ చూసింది... ఈ సినిమా విడుదలైన ఆరు 70 ఎమ్.ఎమ్. థియేటర్లలో శతదినోత్సవం జరుపుకుంది... హైదరాబాద్ లో 4 ఆటలతో వంద రోజులు పూర్తి చేసుకుంది... అప్పట్లో ఈ విషయాన్ని విశేషంగా ముచ్చటించుకున్నారు... కృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు... ఇదే చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా ఏకకాలంలో తెరకెక్కించారు... ఈ సినిమా సమయానికి కృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య విభేదాలున్నాయి... అందువల్ల ఈ సినిమాలో కృష్ణకు రాజ్ సీతారామ్ అనే గాయకుడు నేపథ్యగానం చేశారు... కృష్ణ అభిమానులను విశేషంగా అలరిస్తూ 'సింహాసనం' చిత్రం విజయపథంలో సాగింది... హిందీలో 'సింఘాసన్' అంతగా మురిపించలేకపోయింది...

 
తాను తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం విజయం సాధించగానే కృష్ణ ఉత్సాహంగా మెగా ఫోన్ పట్టుకొని సాగారు... ఆయన దర్శకత్వంలో తరువాతి రోజుల్లో రూపొందిన "శంఖారావం, ముగ్గురు కొడుకులు, కలియుగ కర్ణుడు, కొడుకు దిద్దిన కాపురం, అన్న-తమ్ముడు, బాలచంద్రుడు, రిక్షావాలా, అల్లుడు దిద్దిన కాపురం, నాగాస్త్రం, రక్తతర్పణం" వంటి చిత్రాలు వెలుగు చూశాయి... అయితే వీటిలో ఏది 'సింహాసనం' స్థాయిలో అలరించలేక పోయింది... ఏది ఏమైనా కృష్ణ దర్శకునిగానూ సాగి అభిమానులకు ఆనందం పంచారు... అందుకు బీజం వేసిన చిత్రంగా 'సింహాసనం' నిలచింది... ఈ నాటికీ ఈ మూవీ ఫ్యాన్స్ ను ఏదో రూపంలో అలరిస్తూనే ఉండడం విశేషం!

Updated Date - Mar 21 , 2026 | 03:14 PM