రియలిస్టిక్, వయలెంట్ లవ్ స్టోరీగా 'కాక్రోచ్'
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:04 PM
పలు అవార్డు చిత్రాలను రూపొందించిన సునీల్ కుమార్ రెడ్డి తాజాగా 'కాక్రోచ్' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మార్చి 6న విడుదల కాబోతోంది.
'సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస' వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి (P. Suneel Kumar Reddy) రూపొందిస్తున్న తాజా చిత్రం 'కాక్రోచ్' (Cockroach). ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి. బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'కాక్రోచ్' సినిమాను మార్చి 6న విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బి. బాపిరాజు (B Bapiraju) మాట్లాడుతూ, 'సునీల్ కుమార్ రెడ్డి గారితో కలిసి పలు విజయవంతమైన చిత్రాలను చేశాం. మా కాంబినేషన్‌లో వస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. సహజమైన లొకేషన్స్‌లో రిస్కీ షూటింగ్ చేశాం. సెన్సార్ వారు మా మూవీకి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం అందిస్తుంది' అని అన్నారు.
సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, 'నేను జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాను. పాత్రికేయుడిగా సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో దర్శకుడిగా మారాను. ఆ క్రమంలోనే ఈ 'కాక్రోచ్' మూవీని రూపొందించాను. ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్ మెంట్ వారి సపోర్ట్, నా సహచర పాత్రికేయ మిత్రుల సహకారం తీసుకున్నాను. అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులతో కూడా మాట్లాడి, చాలా విషయాలు తెలుసుకున్నాను. విశాఖ, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్థుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. వేల కోట్ల రూపాయల మోసాలు చేసేవారిని వదిలేసే ఈ వ్యవస్థ, చిన్న చిన్న దొంగతనాలు చేసేవారి మీద ప్రతాపం చూపిస్తుంటుంది. మురికి కూపాలలో ఉన్న నేరస్థుల జీవితాల్లోని అనుభవాలు, ప్రేమలు నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. అడ్డరోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్‌కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించాను. డార్క్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. మనకు తెలియని ఒక ప్రపంచాన్ని పరిచయం చేసే చిత్రమిది. ఇలాంటి రియలెస్టిక్ సినిమాలు కూడా చూసి ఆదరించే ప్రేక్షకులు ఉంటారని నమ్ముతున్నాం. ఈ మూవీని డార్క్ గా, ఓపెన్ గా, బోల్డ్ గా రూపొందించాం. కేవలం వినోదం కోసం సినిమా చూసే వారికి మా మూవీ నచ్చకపోవచ్చు. కానీ మన సమాజంలో ఉన్న చేదు నిజాన్ని చూడాలనుకునేవారికి తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు. అయితే చిన్న పిల్లలు, సున్నిత మనస్కులు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శక నిర్మాతలు విజ్ఞప్తి చేశారు.