పిల్లలు, సున్నిత మనస్కులు 'కాక్రోచ్'కు దూరంగా ఉండాలట!

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:05 PM

ప్రముఖ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తాజా చిత్రం 'కాక్రోచ్' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. బి. బాపిరాజు, ఎం. నాగ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మార్చిలో విడుదల కాబోతోంది.

Cockroach Movie

అవార్డు చిత్రాల దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి (Sunil Kumar Reddy) తాజా చిత్రం 'కాక్రోచ్' (Cockroach). ఈ సినిమాను బి. బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణతో కలిసి నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చినట్టు మేకర్స్ తెలిపారు. సున్నిత మనస్కులు, పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని స్వయంగా దర్శక నిర్మాతలు చెప్పడం విశేషం.

ఈ కథ గురించి సునీల్ కుమార్ రెడ్డి చెబుతూ, 'సమాజం ఛీత్కరించుకొనే మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమకథ 'కాక్రోచ్'. అడ్డరోడ్ లో పడుపు వృత్తి చేసుకొనే వేశ్యకి, ఒక కిరాయి హంతకుడికి మధ్య సాగే స్వచ్ఛమైన స్నేహం ఈ సినిమా. భ్రష్టు పట్టిన అవినీతి సమాజపు చీకటిని ప్రేక్షకులకు పరిచయం చేసే చిక్కటి చిత్రం. కాక్రోచ్ ని చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే ద్వంద్వ విలువల మనస్తత్వాలని ప్రశ్నించే పాత్రలతో ఈ సినిమాను తెరకెక్కించాం' అని అన్నారు. ఈ చిత్రాన్ని మార్చి మొదటి వారం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.


'ఈ చిత్రంలో ఉన్న హింసాత్మక పోరాటాలను సహజంగా చూపించడానికి రియల్ ఫైటర్స్ ని నటులుగా తీసుకున్నామని, అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్ కిరాయి హంతకులుగా నటించగా, 'సొంతవూరు' (Sonthaooru) చిత్రంలో నటించి, ఉత్తమనటి అవార్డును పొందిన తీర్థ (Theerdha) ఇందులో ఓ ముఖ్యపాత్రను చేస్తోందని, ఇతర ప్రధాన పాత్రలను మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేశ్, మల్లిక, ఎఫ్.ఎమ్. బాబాయ్, రాజు, బాలాజీ, ఎల్ బీ రమణ తదితరులు పోషించారని సునీల్ కుమార్ రెడ్డి చెప్పారు.

Updated Date - Feb 07 , 2026 | 06:17 PM