ఈసారి సందీప్ కిషన్‌తో సినిమా!

ABN , Publish Date - Mar 21 , 2026 | 02:39 PM

ఆది సాయికుమార్ తో 'శంబాల' మూవీని రూపొందించిన దర్శక నిర్మాతలు ఇప్పుడు రెండో సినిమాను సందీప్‌ కిషన్‌ తో చేయబోతున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ లో మొదలు కానుంది.

Sundeep Kishan

ఆది సాయికుమార్‌ (Aadi Saikumar) హీరోగా ‘శంబాల’ (Sambala) వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు ఇప్పుడు మరో సినిమాకు స్వీకారం చుట్టబోతున్నారు. ఈ సినిమాను కూడా 'శంబాల' దర్శకుడు యుగంధర్‌ ముని రూపొందించబోతున్నారు. ఈ సోషియో ఫాంటసీ మూవీని పాన్ ఇండియా స్థాయిలో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేస్తూ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఒక సింహం, తోడేలు కనిపిస్తున్నాయి. యుద్ధభూమి బ్యాక్ గ్రౌండ్ లో సింహం, తోడేలు మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ నిటారుగా నిల్చుని ఉంది. ‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు’ అనే క్యాప్షన్ చూస్తే ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.


'శంబాల' తర్వాత సక్సెస్‌ఫుల్‌ టీమ్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ సందీప్ కిషన్‌ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రమని అంటున్నారు. ప్రొడక్షన్‌ డిజైన్‌, విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ టెల్లింగ్ విషయంలో నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ బృందం భారీ స్థాయి సోషియో-ఫాంటసీ డ్రామాగా దీనిని రూపొందించబోతోందట. ఎక్కువ మందికి చేరువయ్యేలా, విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని, ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఘనంగా విడుదల చేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.


‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇక ఈ నూతన ప్రాజెక్ట్‌తో మరోసారి ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని త్వరలో ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026లో ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు.

Updated Date - Mar 21 , 2026 | 02:48 PM