హిట్ కోసం సందీప్ కొత్త ప్రయోగం

ABN , Publish Date - Feb 27 , 2026 | 07:00 PM

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని! అన్నట్టు తయారైంది హీరో సందీప్ కిషన్ పరిస్థితి. మంచి కథను, దానికి తగ్గ దర్శకులను ఎంచుకున్నా విజయం మాత్రం దక్కడం లేదు. అందుకే ఈసారి మరింత పంతంతో, మునుపెన్నడూ చేయని పాత్రతో బాక్సాఫీస్‌కు చాలెంజ్ విసిరేందుకు రెడీ అవుతున్నాడు.

యంగ్ హీరో సందీప్ కిషన్ తన కమ్‌బ్యాక్‌ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. దర్శకుడు కృష్ణ చైతన్యతో కలిసి చేస్తున్న 'పవర్ పేట' సినిమాతో మళ్లీ సక్సెస్ బాటపట్టాలని అనుకుంటున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని అనేక సాహసాలు చేస్తున్నాడు. అందుకోసం సందీప్ తన లుక్, బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడమే కాదు.. మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. దీనికి తోడు పీరియడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను భారీ సెట్స్, ఆర్ట్ వర్క్‌తో ఆకట్టుకునేలా తీస్తుండటం ఆసక్తికరంగా మారింది.


'ప్రస్థానం', 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'తెనాలి రామకృష్ణ' వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపును అందుకున్నాడు సందీప్ కిషన్. తెలుగు, తమిళ భాషల్లోనూ విభిన్న పాత్రలతో అలరించాడు. కానీ ఇటీవల వరుస పరాజయాలు అతన్ని వెంటాడుతున్నాయి. మంచి కథలే ఎంపిక చేసుకుంటున్నా.. విజయం మాత్రం రావడం లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే గతంలో మరో యంగ్ హీరో నితిన్ లాగే సందీప్ కిషన్ పరిస్థితి తయారైంది. అయితే 'పవర్ పేట' సినిమాతో తనను వెంటాడుతున్న బ్యాడ్ టైమ్ వదిలి వెళ్లిపోతుందని నమ్ముతున్నాడట సందీప్ కిషన్.

మరోవైపు ఈ సినిమా దర్శకుడు కృష్ణ చైతన్యపై కూడా చాలా నమ్మకం పెట్టుకున్నాడు యంగ్ హీరో. 'రౌడీ ఫెలో', 'చల్ మోహన్ రంగ', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' వంటి విభిన్న చిత్రాలతో టాలీవుడ్ పై తనదైన ముద్ర వేసిన దర్శకుడు కృష్ణ చైతన్య కూడా ఈ ప్రాజెక్ట్‌ను తన కెరీర్‌లో ముఖ్యమైనదిగా భావిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పీరియడికల్ డ్రామాస్‌ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ద్వారా సందీప్ కిషన్ తన టాలెంట్‌ను మళ్లీ నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో!

Read Also: విస్తరిస్తున్న హోంబలే వ్యాపార సామ్రాజ్యం

Read Also: ఉస్తాద్ భగత్ సింగ్: అభిమానులకు విందు..  మాస్ సినిమాకు కొత్త నిర్వచనం

Updated Date - Feb 27 , 2026 | 07:03 PM