వేసవి బరిలో... సినిమాలే సినిమాలు!
ABN , Publish Date - Feb 16 , 2026 | 09:43 AM
వేసవి 2026లో టాలీవుడ్‌లో భారీ సినిమాల సందడి మొదలైంది. పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, యశ్ ‘టాక్సిక్’, రామ్ చరణ్ ‘పెద్ది’ సహా మార్చి, ఏప్రిల్‌లో విడుదల కానున్న చిత్రాల పూర్తి జాబితా తెలుసుకోండి.
ఒకప్పుడు వేసవి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వరుస చిత్రాలు పోటీపడేవి. తమ అభిమాన హీరోలు నటించిన సినిమాలు చూడడం కోసం సినీ ప్రియులు మండుటెండను సైతం లెక్కచేయకుండా థియేటర్ల దగ్గర క్యూ కట్టేవారు. అయితే అగ్రహీరోలు పాన్ ఇండియా సినిమాలపై దృష్టిపెట్టడం, చిన్న.. మీడియం బడ్జెట్ చిత్రాలు విడుదలైనా అవి అంతగా అలరించకపోవడం.. ఇతర కారణాల వల్ల ఈ మధ్య వేసవి చిత్రాల హడావుడి తగ్గింది. కానీ ఈసారి వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులను అలరించడానికి వరుస చిత్రాలు సిద్ధమవుతున్నాయి.
మార్చి 6న లావణ్య త్రిపాఠి నటించిన ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi) విడుదల కానుంది. శివాజీ, లయ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani) మార్చి 6న ప్రేక్షకులను పలకరించనుంది. ‘కోర్టు’ జంట హర్ష్ రోషన్, శ్రీదేవీ మరోసారి మార్చి 13న ‘బ్యాండ్ మేళం’ (Band Melam) తో అలరించనున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో ఒక్కసారిగా స్టార్‌డమ్ అందుకున్న యశ్ నటించిన చిత్రం ‘టాక్సిక్’ (Toxic ). గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న ఉగాది సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’ సీక్వెల్‌గా తెరకెక్కింది ‘ధురంధర్ -2’ (Dhurandhar 2). మార్చి 19న తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది. పవన్‌కల్యాణ్ తన అభిమానులను ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) తో అలరిండానికి సిద్ధమయ్యారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 26న విడుదలవుతోంది. రాశీ ఖన్నా, శ్రీలీల కథానాయికలు.
ఏప్రిల్‌లో.. వరుస చిత్రాలు
‘నారీ నారీ నడుమ మురారీ’తో హిట్ అందుకున్న శర్వానంద్ బైక్ రేసర్ (Biker) గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదలవుతోంది. అభిలాష్ కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. విక్రమ్ సమర్పిస్తున్నారు. ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ నటిస్తున్న ‘రాకాస’ (Raakaasaa) కూడా ఏప్రిల్ 3న విడుదలవుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక.. ‘స్వయంభు’ (Swayambhu)తో ప్రేక్షకులను పలకరించున్నారు నిఖిల్ సిద్ధార్థ. ఏప్రిల్ 10న విడుదలవుతోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రానికి భరత్‌కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మించారు. వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు పొందిన అడివి శేష్ ‘డెకాయిట్’(Dacoit)గా అలరించడానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 10న చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi). దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీమేకర్స్ సమర్పణలో వృద్దీ సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్‌కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతోంది.
ఇదే వేసవిలో చిరంజీవి విశ్వంభర (Vishwambhara), వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam), అడివి శేష్ నటిస్తున్న ‘గూఢచారి 2’ (Goodachari 2), అఖిల్ ‘లెనిన్’ (Lenin), సాయి దుర్గాతేజ్ ‘సంబరాల యేటి గట్టు’, వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju), రవిబాబు ‘రేజర్’ (Razor), విరాట్ కర్ణ ‘నాగబంధం’, తిరువీర్ భగవంతుడు (Bhagavanthudu) చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. అయితే వాటి విడుదల తేదీలపై త్వరలోనే స్పష్టత రానుంది.