Sumanth: వారం ముందుకొచ్చిన 'న్యూటన్స్ థర్డ్ లా'... లేదంటే కథ వేరేలా...
ABN , Publish Date - Jul 21 , 2026 | 03:35 PM
సుమంత్ నటించిన గత రెండు చిత్రాలు ఓటీటీలో స్క్రీమింగ్ అవ్వగా, లేటెస్ట్ రెండు చిత్రాలు థియేటర్లలో పదిహేను రోజుల్లో తేడాతో విడుదల కాబోతున్నాయి.
'సీతారామం', 'సార్' చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన సుమంత్ మళ్ళీ హీరోగా నటించిన రెండు సినిమాలు 'అహం రీబూట్', 'అనగనగా...' ఓటీటీలో వచ్చాయి. ఇందులో మొదటిది ఆహాలో స్ట్రీమింగ్ అయితే... రెండో సినిమా ఈటీవీ విన్ లో వచ్చి, చక్కని వీక్షకాదరణ పొందింది. ఈ సినిమాలోని ఉత్తమ నటనకు గానూ సుమంత్ కొన్ని ప్రైవేట్ కల్చరల్ సంస్థల నుండి అవార్డులు కూడా అందుకున్నాడు. అయితే ఇప్పుడు సుమంత్ నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్థం అయ్యాయి.
'అనగనగా...' చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న ఈటీవీ విన్ మరోసారి సుమంత్ తో తీసిన సినిమా 'న్యూటన్స్ థర్డ్ లా'. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కె. హరీశ్ నిర్మించారు. థ్రిల్లర్ జానర్‌ను రీడిఫైన్ చేసే ఈ మూవీకి 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ సింజిత్ సంగీతం అందించారు. ఈ సినిమాను మొదట ఆగస్ట్ 7న విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడీ మూవీ జూలై 31వ తేదీనే థియేటర్లలో విడుదల కాబోతోంది. థ్రిల్లర్ జానర్ గురించి మాట్లాడినప్పుడల్లా 'న్యూటన్స్ థర్డ్ లా' పేరు కూడా తప్పకుండా వినిపిస్తుందని దర్శకుడు రాజేశ్ కర్ణ గట్టిగా చెబుతున్నారు. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్ ఇందులో కీలక పాత్రను పోషించారు.
ఇదిలా ఉంటే... ఆగస్ట్ 14న సుమంత్ నటించిన మరో సినిమా కూడా థియేటర్లలోకి రాబోతోంది. అదే 'మహేంద్రగిరి వారాహి'. దాదాపు నాలుగేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమాకు తొలుత 'వారాహి' అనే పేరు పెట్టారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, 'వెన్నెల' కిశోర్, రాజీవ్ కనకాల, అలీ ఇందులో కీలక పాత్రలు పోషించారు. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు ఊరూవాడా మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన 100 థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, పూజలు చేయడం మొదలు పెట్టారు. హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సుమంత్ కూడా హాజరయ్యాడు. మొత్తం మీద బ్యాక్ టు బ్యాక్ రాబోతున్న సుమంత్ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకారణ పొందుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Sakshi Agarwal: చిరకాల స్వప్నం సాకారమైంది
రకుల్, కాజల్ ముందు సాయి పల్లవి వేస్ట్..
Mamitha Baiju: మమిత జోరు మాములుగా లేదు.. అసలు తగ్గట్లేదుగా