'మహేంద్రగిరి వారాహి' ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:35 PM
సుమంత్ హీరోగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'మహేంద్రగిరి వారాహి' సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుమంత్ (Sumanth) హీరోగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విడుదల తేదిని ప్రకటించారు, సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుమంత్ మాట్లాడుతూ 'ఈ సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్ల పాటు చర్చలు జరిగాయి. మధ్యలో ప్రాజెక్ట్ కొన్ని కారణాలతో సందిగ్ధంలో పడినా, చివరకు అనుకున్న విధంగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. కథలో ఎన్నో ఊహించని మలుపులు ఉంటాయి, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా దర్శకుడు సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం నటి ఐశ్వర్యా రాజేశ్‌ను సంప్రదించగా, కథ నచ్చడంతో వెంటనే అంగీకరించారు. అయితే ఆమె వారాహి అమ్మవారి పాత్రలో నటించారా లేదా మరో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారా అనే విషయాన్ని సినిమా చూసి తెలుసుకోవాలి. ఆ సర్‌ప్రైజ్‌ను ప్రేక్షకులు థియేటర్లలోనే ఆస్వాదించాలి. ఇక బడ్జెట్ విషయానికొస్తే మొదట రూ.10 కోట్లతో సినిమాను పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ, కథకు అవసరమైన స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు పెరిగింది. వీఎఫ్‌ఎక్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాము. గూస్‌బంప్స్ వచ్చేలా విజువల్స్ ఉంటాయి' అన్నారు.
'ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భావిస్తున్నట్లు దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తెలిపారు. ప్రస్తుతం ఆయనను సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికారికంగా ఖరారైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
'ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో దాదాపు 20 నిమిషాల పాటు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని నిర్మాత మధు వెల్లడించారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.